Heart attack | హుజురాబాద్, నవంబర్ 8 : హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన ఎల్ఎండీ ప్రాజెక్టు మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చోలేటి కిషన్ రెడ్డి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి సమీప బంధువు రఘోత్తమ రెడ్డి కూతురు వివాహం శుక్రవారం హన్మకొండలో జరిగింది.
సాయంత్రం పోతిరెడ్డిపేట గ్రామంలో పెళ్లి బారాత్ నిర్వహించారు. ఈ బారాత్ లో కిషన్ రెడ్డి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు హుటాహుటిన ఆయనను హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వైద్యుల ధ్రువీకరణ అనంతరం మృతదేహాన్ని తిరిగి పోతిరెడ్డిపేటకు తరలించారు. మృతుడు కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేశారు.
ఆయన గతంలో ఎల్ఎండీ ప్రాజెక్టు చైర్మన్ గా కూడా పనిచేశారు. కిషన్ రెడ్డి గతంలో కూడా గుండెకు సంబంధించిన చికిత్స జరిగింది. అయితే డీజే సౌండ్ తోనే అతడు మృతి చెందినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. సీనియర్ నాయకుడి ఆకస్మిక మరణంతో పోతిరెడ్డిపేట గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.