Traffic Rules | గంగాధర, జనవరి 17 : ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టవచ్చని గంగాధర ఎస్సై వంశీకృష్ణ అన్నారు. గంగాధర మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ పేరుతో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడమేనని పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడే ముఖ్యమైన రక్షణ చర్యలని వివరించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తీవ్ర ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. అధిక వేగంతో వాహనాలు నడపకుండా వేగ నియంత్రణ పాటించాలని, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకూడదని తెలిపారు.
ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవిస్తూ వాహనాలు నడపడం ప్రతీ పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచి, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు, యువకులు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.