Veenavanka | వీణవంక, ఏప్రిల్ 18: వాహనదారులకు గులాబీపూలు అందజేస్తూ.. జాగ్రత్తలు చెప్తూ వీణవంక పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ, రోడ్డుపై ధాన్యం ఆరబోసిన చోట పోలీసులతో కలిసి హెల్మెట్ ధరించని, సీట్‌బెల్ట్ పెట్టుకోని వాహనదారులను ఆపి వారికి గులాబీ పూలు, హెల్మెట్ ధరించిన వారికి పండ్లు అందజేస్తూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల తిరుపతి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటపుడు హెల్మెట్, ఫోర్ వీల్ నడిపేవారు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, లేకుంటే గాయపడిన పువ్వు ఎలా నలిగిపోతుందో హెల్మెట్ ధరించని వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రోడ్డుపై ప్రయాణించేటపుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.