వ్యవసాయ యాంత్రీకరణకు ఆదరణ కరువవుతున్నది. కాంగ్రెస్ సర్కారు ప్రోత్సాహం లేక రైతుల నుంచి నిరాసక్తి కనిపిస్తున్నది. నాడు ఒక్కో యూనిట్‌పై 10లక్షల వరకు ప్రయోజనం కల్పించినా.. నేడు యూనిట్ విలువ తగ్గించి, కేవలం 3వేలలోపే అందిస్తుండడం, సాగులో కీలకమైన ట్రాక్టర్లు, హార్వెస్టర్లు సబ్సిడీ పరిధిలో లేకపోవడం కారణంగా ముందుకు రావడం లేదు. వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి మరోసారి గడువు పొడిగించినా పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
పెద్దపల్లి, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : నాడు కేసీఆర్ సర్కారు రైతన్నకు అన్నింటా వెన్నుదన్నుగా నిలిచింది. సాగునీటిని తెచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేయడంతోపాటు సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించింది. అందులో భాగంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రైతులందరికీ 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, హార్వెస్టర్లతోపాటు ఇతర పని ముట్లను అందజేసింది. ఒక్క పెద్దపల్లి జిల్లాలో 13 రూరల్, ఒక అర్బన్ మండలానికి 101 పెద్ద ట్రాక్టర్లు, 13 మినీ ట్రాక్టర్లు, 5 హార్వెస్టర్లు, రెండు వరి నాటే యంత్రాలు, 10 ట్రాక్టర్ డ్రాన్లు, 10 ప్లాంట్ ప్రొటెక్షన్లు, 10 అత్యధిక విలువైన మిషనరీలు, 15 పవర్ టిల్లర్లు, 10,838 టార్పాలిన్లు, 25 మందికి సోలార్ ఫెన్సింగ్‌లను 50 శాతం సబ్సిడీతో అందించింది.
మొత్తంగా బీఆర్ఎస్ హయాంలో 11,029 మంది రైతులకు పనిముట్లను అందజేసింది. కానీ, రెండున్నరేళ్ల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు మాత్రం యాంత్రీకరణను నీరుగారుస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. సాగులో ప్రధానంగా అవసరమయ్యే ట్రాక్టర్, హార్వెస్టర్ వంటివి కాకుండా చిన్న తరహా పరికరాలు మాత్రమే ఇస్తుండడంతోనే ఆదరణ కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50శాతం, సాధారణ, బీసీ, ఇతర కులాల రైతులకు 40 శాతం రాయితీని ప్రకటించడం, కొత్తగా ఐదెకరాలల్లో సాగు భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తింపజేస్తామని చెప్పడం కారణంగా రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు.
నాడు బీఆర్ఎస్ పాలనలో ఒక్కో యూనిట్‌పై 10లక్షల వరకు ప్రయోజనం కల్పించగా, నేడు కేవలం 3వేలలోపే అందిస్తుండడంతో స్పందన కనిపించలేదు. సాగులో ప్రధానంగా ఉపయోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్ల లాంటివి సబ్సిడీ పరిధిలో లేకపోవడంతో యాంత్రీకరణ కోసం దరఖాస్తులు కోరినా అనుకున్నంతగా ముందుకు రాలేదు. మొదట గత నెల 28 వరకు, ఆ తర్వాత గడువు పొడిగించి ఈ నెల 15 వరకు అవకాశం ఇచ్చినా పెద్దగా ఆసక్తి చూపలేదు. గత ప్రభుత్వంలో పెద్దపల్లి జిల్లాలో 11 వేలకుపైగా అర్జీలు రాగా, ప్రస్తుతం రెండు వేలు కూడా దాటలేదు. కేవలం 1850 అర్జీలే వచ్చాయి.
యూనిట్ల విలువ తగ్గించడం వల్లే ఆదరణ చూపలేదని తెలుస్తున్నది. ఇటు వచ్చిన దరఖాస్తుల్లోనూ రకరకాల సాకులతో సర్కారు కోతలు పెట్టింది. కేవలం 431మందినే అర్హులుగా ప్రకటించింది. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ విలువను తగ్గించడం వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఉండదని వాపోతున్నారు. సాగులో కీలకమైన ట్రాక్టర్లు, హార్వెస్టర్ల లాంటి వాటిని కూడా సబ్సిడీ పరిధిలోకి తేవాలని కోరుతున్నారు.