న్యూఢిల్లీ: హాట్‌మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా భారతదేశంలోని రియల్ ఎస్టేట్ రంగంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను 2012లో బుక్ చేసుకున్న అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ 2032 నాటికి తన స్వాధీనం అవుతుందని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఇంటి కోసం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగే ఈ సుదీర్ఘ నిరీక్షణపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక యువకుడిగా ఉన్నప్పుడు తాను భారతదేశంలో ఒక ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేశానని, అయితే ఈ ప్రాజెక్ట్ పలు పరిణామాలను ఎదుర్కొంటూ, ఆలస్యం కావడంతో తాను వృద్ధుడినయ్యే సమయానికి ఇల్లు చేతికి వస్తుందని భాటియా వాపోయారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ స్పందనలను చూసిన భాటియా వాస్తవానికి భారత్ అభివృద్ధి చెందడం లేదనిపిస్తోందని పేర్కొన్నారు.