Token strike | గోదావరిఖని : సింగరేణి లో కొత్త గనుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20 న సింగరేణిలో జరగబోయే ఒక రోజు టోకెన్ సమ్మె చేపట్టినట్లు సింగరేణి జేయసీ నాయకులు తెలిపారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులకు సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు పిలుపునిచ్చారు.
గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో ఏఐటియుసి, ఐఎన్టీయుసి, సిఐటియు, టిబిజికేఎస్ సంఘాల నాయకులు కొరిమి రాజ్ కుమార్, దేవులపల్లి రాజేందర్, తుమ్మల రాజిరెడ్డి, మాదాసు రాంమూర్తి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం లోని బిజేపి ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి పరిశ్రమ యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటూ, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమ లలో పని చేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికులకు తీవ్ర నష్టం చేసే విధానాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన టోకెన్ సమ్మె కు పిలుపు నిచ్చాయని వారు పేర్కొన్నారు.
అందులో భాగంగా సింగరేణిలో ఈ టోకేన్ సమ్మె ను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కుల సాధన కొరకు సమ్మె చేస్తున్నామన్నారు. సింగరేణి మనుగడ సాధించాలంటే కొత్త గనులు రావాలని అందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని, ఈ సమ్మె విజయవంతం చేసికేంద్రం లోని బిజేపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని వారు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు ఎల్ ప్రకాష్, మడ్డి ఎల్లా గౌడ్, కవ్వంపల్లి స్వామి, జీగురు రవిందర్, ఎం.ఎ. గౌస్, బి అన్నారావు, సయ్యద్ సోహేల్, సిఐటియు నాయకులు మెండె శ్రీనివాస్, నరహరి, సారయ్య, టిబిజికేఎస్ నాయకులు వడ్డెపెల్లి శంకర్, పి శ్రీనివాస్ తో పాటు ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.