లోకాలను పాలించే జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగ దసరా. నేడు ఈ విజయదశమిని జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.
కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 11 : హిందూ సంప్రదాయంలో విజయదశమి విశిష్టమైన రోజు.. లోకాలను పాలించే జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగ దసరా.. విజయాలను అందించే ఈ విజయదశమిని శనివారం ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. ఆలయాలన్నింటినీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలుచోట్ల రామ్‌లీలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా కాలనీలు, దుర్గామాత మండపాల వద్ద శమీ పూజలు, వాహన పూజలు నిర్వహించనున్నారు. అలాగే దసరా రోజు యంత్రం, వాహన, పనిముట్లను పూలతో అలంకరించి, పూజలు చేస్తారు. అందుకోసం ఆలయాల వద్ద వాహనాలతో బారులు తీరుతారు. ఆలయ అర్చకులతో పూజలు చేయించుని, తృణమో ఫణమో సమర్పిస్తారు.
జిల్లా వ్యాప్తంగా దసరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖ ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా మారాయి. నగరంలోని గిద్దెపెరుమాళ్ల ఆలయంతో పాటు, నగరంలోని మహాశక్తి ఆలయాల్లో ప్రత్యే క ఏర్పాట్లతో పండుగ శోభను సంతరించుకున్నాయి. గిద్దెపెరుమాళ్ల ఆలయ ఈవో మారుతి ఆధ్వర్యంలో వాహన, షమి పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం షామియానాలు, పందిళ్లు సిద్ధం చేశారు. సాయంత్రం 8 గంటలకు మహిషాసుర సంహార కార్యక్రమం నిర్వహించనున్నారు.
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ స్కూల్ మైదానంలో జరిగే రాంలీలాతోపాటు మున్సిపల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో దసరా ఉత్సవాలకు మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రాంలీలా ఏర్పాట్లను శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ పర్యవేక్షించారు. పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 11 : కరీంనగర్ మండలం నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో దసరా పండుగా సందర్భంగా శనివారం అమ్మవారు విజయలక్ష్మీ అలంకరణలో గజ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు, ఆలయంలో ఉదయం 8 గంటలకు నుంచి వాహన పూజలు నిర్వహిస్తారు. సాయం త్రం 4 గంటలకు వేద పండితుడు పురా ణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శమీపూజ, రావణ సంహారం కార్యక్రమాలు జరుగుతాయి, దుర్శేడ్ వేణుగోపాలస్వామి ఆలయం, చెర్లభూత్కూర్ చెన్నకేశవ ఆలయం, బొమ్మకల్‌లోని శివాజీ నగర్‌లోని అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నగునూర్‌లోని జెండా చౌరస్తా వద్ద శమీ, వాహనపూజలు నిర్వహిస్తున్నారు. తీగలగుట్టపల్లిలోని అమ్మ భవానీ ఆలయం, కోదండ రామాలయం, చామనపల్లి త్రిశక్తి ఆలయం, ఉమాహేశ్వర ఆలయంలో శమీ పూజలకు ఏర్పాట్లు చేశారు.