Revanth Reddy | ఎన్నికలకు ముందు యువత ఓట్లు దండుకునేందుకు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోయింది. మొత్తం 17కుపైగా హామీలు ఇవ్వడంతోపాటు మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆ పార్టీ, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. కానీ, ఏడాది పాలనను పురస్కరించుకొని బుధవారం పెద్దపల్లిలో నిరుద్యోగ విజయోత్సవ సభను నిర్వహిస్తుండగా.. ఏమి సాధించారని సభ నిర్వహిస్తున్నారో చెప్పాలని యువత ప్రశ్నిస్తున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సర్కారు తమపై వివక్ష చూపుతున్నదని మండిపడుతున్నది. మరోవైపు సింగరేణి కార్మికులకు సైతం ఇచ్చిన అనేక హామీల అమలుపైనా ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి పెద్దపల్లి జిల్లాకు వస్తున్న రేవంత్‌రెడ్డి, కార్మికులకు ఏమైనా తీపి కబురు చెబుతారా.. లేదా..? అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతున్నది.
కరీంనగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యువతను ఆకట్టుకునేందుకు యూత్ డిక్లరేషన్ పేరిట హామీల వర్షం కురిపించింది. మొత్తంగా 17కుపైగా హామీలు ఇచ్చి, తాము అధికారంలోకి వస్తే వాటన్నింటినీ అమలు చేస్తామని మభ్యపెట్టింది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతోపాటు అభయహస్తం పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో పెట్టింది. నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు లాభం చేకూరుతుందని యువత నమ్మి, ఆ మేరకు ఓట్లు వేసింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా నేటికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు.
ఇప్పుడు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా.. నిరుద్యోగ విజయోత్సవాన్ని నేడు పెద్దపల్లిలో నిర్వహిస్తున్నది. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. నిజానికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 50వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నది. నిజానికి అందులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి నోటిఫికేషన్లు ఎన్ని? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? చెప్పాలన్న డిమాండ్ నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నది. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని నమ్మినా.. పాలకులు చెబుతున్నట్టు భర్తీ చేసింది 50వేలే కదా..? అలాంటప్పుడు 2లక్షల మాట తప్పినట్టే కదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి సభలో ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలన్నా చర్చ నడుస్తున్నది.
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో భాగంగా.. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వడంతోపాటు తల్లి, తండ్రి, భార్యకు నెలవారీగా 25వేల అమరవీరుల గౌరవ పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతోపాటు జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పింది. మెదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెలా 4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది.
కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్, ఏడు జోన్లలో ఉపాధి కల్పనా కార్యాయాల ఏర్పాటుతోపాటు ప్రతి జిల్లాలో స్కిల్డ్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో రాష్ట్ర యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పన, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీలేని రుణ సదుపాయం, ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పన, గల్ఫ్ కార్మికుల సంక్షేమం.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లిం స్తామని చెప్పింది.
పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని, బాసరలోని రాజీవ్‌గాంధీ ట్రిపుల్ఐటీ మాదరిగా నాలుగు నూతన ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నది. అలాగే అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచ స్థాయి క్రీడా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నది. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్‌లో రెండు విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని, 6వ తరగతి నుంచి పట్టభద్రులయ్యే వరకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నది. యువ మహిళా సాధికారత కింద 18ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికీ ఎలక్ట్రిక్ స్కూటర్ల అందజేస్తామని, ఆరు గ్యారెంటీల్లో యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కానీ, అందులో ఏ ఒక్క హామీని అమలు చేయలేదు.
అసెంబ్లీ, సింగరేణి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీతోపాటు దాని అనుబంధ కార్మిక సంస్థ ఐఎన్టీయూసీ అనేక హామీలు ఇచ్చింది. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేసేందుకు కృషి చేస్తామని, అలాగే కార్మికులకు విధిస్తున్న అలవెన్సులపై ఆదాయ పన్ను రద్దు చేస్తామని, సొంత ఇంటి పథకం కింద 250 గజాల జాగా ఇప్పించడంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు 20 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పింది. సింగరేణిలో కొత్త బొగ్గు గనులను ప్రారంభించి, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా హామీల అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. నిజానికి సింగరేణి సంస్థలో 43వేల మంది కార్మికులు రేయింబవళ్లు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తున్న వేతనాల నుంచి ఏటా 800కోట్ల వరకు ఆదాయపన్ను రూపంలో కేంద్రానికి చేరుతున్నాయి.
కార్మికులకు ప్రతి నెలా 300 కోట్ల వేతనాలు అంటే ఏడాదికి దాదాపు 3600 కోట్ల నుంచి 4వేల కోట్ల వరకు సంస్థ చెల్లిస్తున్నది. అలాగే మరో వెయ్యి కోట్ల వరకు లాభాల వాటా, బోనస్‌లు అందుతున్నాయి. వీటిపై ఆదాయపన్ను రూపేణా కేంద్ర ప్రభుత్వం శ్లాబుల ప్రకారంగా వసూలు చేస్తున్నది. 10, 20, 30 శాతంగా ఉన్న శ్లాబుల ప్రకారం ఆదాయపన్నును చెల్లించాల్సి రావడంతో ఆ మొత్తం 800కోట్ల పైచిలుకుగానే ఉంటుందని సింగరేణి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భూగర్భంలోకి వెళ్లి నల్ల బంగారం (బొగ్గు)ను వెలికితీస్తున్న కార్మికులను దేశ సైనికుల మాదిరిగా గుర్తించి, వారికి ఆదాయ పన్నును రద్దు చేయాలని డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నది.
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 2014లో ఐటీ రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి నాటి కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కానీ, కార్మికుల నుంచి వస్త్తున్న భారీ ఆదాయాన్ని వదులుకోవడానికి ఇష్టపడని కేంద్రం ఆ ఆదాయపన్నును వసూలు చేస్తూనే ఉన్నది. దీని వల్ల కార్మికవర్గంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతూనే ఉన్నది. ఒకవైపు ఆదాయపన్ను ద్వారా భారీగా లబ్ధి పొందుతున్న కేంద్రం, ఏటా సింగరేణి సంస్థ ఆర్జించే లాభాలపై ఆదాయపన్ను రూపేణా దాదాపు 400 కోట్ల వరకు లబ్ధి పొందుతున్నట్టు సింగరేణి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు, ఐటీ మినహాయింపుపై ముఖ్యమంత్రి నేటి సభలో ఏమైనా మాట్లాడుతారా.. లేదా..? అన్న చర్చ ప్రస్తుతం సింగరేణిలో నడుస్తున్నది. వీటితో పాటు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకునే విధంగా ఏమైనా ఆదేశిస్తారా.. లేదా..? అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.