పెద్దపల్లి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా కలెక్టరేట్ ఎదుట పెద్దకల్వల, రంగంపల్లి శివారులో నిర్వహించే యువ వికాస విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4గంటలకు రంగంపల్లి సబ్‌స్టేషన్ వెనుక ఉన్న హెలీప్యాడ్‌లో సీఎం ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి సభా స్థలికి చేరుకొని, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తారు. అనంతరం వేదికపైకి చేరుకుంటారు.
ఇటీవల గ్రూప్-4, సింగరేణి కొలువులు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.50 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదికను సిద్ధం చేశారు. అలాగే సుమారు 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. సభ సందర్భంగా ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ఉదయం 8 గంటల నుంచి దారి మళ్లింపు చేస్తున్నామని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. రాత్రి 7గంటల సమయంలో భద్రతా ఏర్పాట్లను మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించారు.