తమకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు విస్తృత పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ‘బంద్ ఫర్ జస్టిస్’కు అన్ని వర్గాలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించగా, గులాబీ శ్రేణులు కదం తొక్కేందుకు రెడీ అయ్యాయి. సీపీఎం, సీపీఐ తదితర వామపక్ష పార్టీలతోపాటు ఎంఆర్పీఎస్, ప్రజామిత్ర వంటి ప్రజా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా బంద్ పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, శుక్రవారం కరీంనగర్‌లోని టవర్ సర్కిల్లో బీసీ సంఘాల నాయకులు డప్పు చాటింపు వేయించి, బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను సాధించుకునే క్రమంలో బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. అసెంబ్లీలో చేసిన తీర్మానం బిల్లును గవర్నర్ ఆమోదించక పోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హై కోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టి వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో బీసీ సంఘాలు ఆగ్రహంతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీపై బీసీ సంఘాల నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. రిజర్వేషన్లు లీగల్‌గా నిలబడవని తెలిసే ఇష్టానుసారంగా వ్యవహరించిందని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. రిజర్వేషన్ల సాకు చూపి బీసీలను తమ అధికారం కోసం వాడుకోవాలని చూస్తున్నదని ధ్వజమెత్తుతున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన ‘బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చేసిందంతా చేసి బంద్‌కు మద్దతు ప్రకటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యూహం లేకుండా రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించిన కాంగ్రెస్.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయిందని, ఇచ్చిన జీవోను కోర్టులో నిలబెట్టుకోలేక పోయిందని, ఆ పార్టీకి వంద మంది ఎంపీలున్నా పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్లపై కనీసం మాట్లాడ లేక పోయిందని ధ్వజమెత్తుతున్నారు. బీసీల ముందు నిస్సహాయ స్థితిలో నిలబడిన కాంగ్రెస్ బంద్‌కు మద్దతు ఇచ్చినంత మాత్రాన చేసిన తప్పులు కప్పిపుచ్చుకోలేదని బీసీలు అంటున్నారు.
బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జిల్లాలో అన్ని ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు వెల్లువెత్తుతున్నది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇటు సీపీఎం, సీపీఐ వంటి వామపక్ష పార్టీలు కూడా మద్దతునిస్తున్నాయి. బీసీల్లోని అన్ని కుల సంఘాలు ఇప్పటికే సమావేశాలు నిర్వహించుకొని, బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి. ఇటు ఎంఆర్పీఎస్, ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అంతే కాకుండా రెండు మూడు రోజులుగా బీసీ సంఘాల నాయకులు వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులను ప్రత్యక్షంగా కలిసి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్‌కు సహకరిస్తామని చెప్పడమే కాకుండా శనివారం పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్టు తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. మరోపక్క మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపి వేయాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. లాంగ్రూట్లలో బస్సులు మాత్రమే నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇటు పెట్రోల్ బంక్‌లు కూడా పూర్తిగా మూసివేస్తున్నారు. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనున్నది. బంద్‌కు సహకరించాలని పలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం టవర్‌సర్కిల్‌లో డప్పు చాటింపు వేయించారు. టవర్ సర్కిల్లో గల్లిగల్లీ తిరిగిన బీసీ సంఘాల నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించడం కనిపించింది.
బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఉద్యమానికి మా పెరిక కులం అండగా ఉంటుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టాలి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని కుంటి సాకుతో బీసీలకు అన్యాయం చేస్తున్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలు పేదరికంలో మగ్గుతున్నారు. సామాజిక వెనకబాటుకు గురవుతున్నారు. జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పిస్తే తప్పేంటి? 10 శాతం జనాభా ఉన్న ఓసీలకు 10 శాతం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు కల్పించినప్పుడు అడ్డురాని 50 శాతం నిబంధన బీసీల విషయంలో ఎందుకు వస్తున్నది. రాబోయే కాలంలో మరిన్ని బీసీ ఉద్యమాలు నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని ఉద్యమాలకు మా పెరిక కుల సంఘం అండగా ఉంటుంది.
– గాండ్ల చంద్రశేఖర్, పెరిక సంఘం జిల్లా అధ్యక్షులు (కరీంనగర్)
మేం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యపట్టణాల్లో అన్ని వ్యాపార వర్గాలకు, విద్యాసంస్థల అధినేతలకు విజ్ఞప్తి చేశాం. సానుకూలంగా స్పందించారు. వాణిజ్య వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్ చేసేందుకు సహకరిస్తామని చెప్పారు. శనివారం ఉదయం నుంచి బీసీలు రోడ్లపైకి వచ్చి బంద్ పాటించేలా చూడాలని అన్ని సంఘాల నాయకులకు విన్నవించాం. ఎక్కడ కూడా అల్లర్లకు తావీయకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించాలని బీసీ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్తాం. అక్కడ ధర్నా నిర్వహిస్తాం. బంద్‌కు అన్ని పార్టీల మద్దతు ఉన్నది. అందరూ సహకరించాలని టవర్ సర్కిల్లో డప్పు చాటింపు కూడా వేయించాం.
– ఎన్నం ప్రకాశ్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేననే ప్రధాన డిమాండ్‌తో అఖిల పక్షం శనివారం బంద్‌ను చేపడుతున్నది. బీసీలకు రాజ్యాధికారం, విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో బీసీలంతా పాల్గొనాలి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, బంద్‌ను విజయవంతం చేయాలి.
– పుట్ట మధూకర్, మంథని మాజీ ఎమ్మెల్యే