Siricilla | గాంధీ చౌక్: భార్యను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం, రుద్రంగి ఎస్సీ కాలనీకి చెందిన ఏనుగందుల రాజయ్య కుమార్తె హేమలతకు అదే కాలనీకి చెందిన సింగారపు జనార్ధన్‌తో 2011 లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.1 లక్ష నగదు, సుమారు ఒకటిన్నర తులాల బంగారం కట్నంగా ఇచ్చారు.
వివాహం అనంతరం కొంతకాలానికే జనార్ధన్ ట్రాన్స్‌కోలో ఉద్యోగం పొందిన తర్వాత మరింత డబ్బు తీసుకురావాలని హేమలతపై ఒత్తిడి పెంచాడు. హేమలత తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో అదనపు డబ్బు తీసుకురాలేకపోయింది. దీంతో ఆమెపై తరచూ మానసిక, శారీరక వేధింపులు కొనసాగాయి.ఈ వ్యవహారంలో జనార్ధన్ సోదరి సింగారపు శారద (A2), బంధువు తేడ్డు సాగర్ (A3)తో పాటు ఒక మైనర్ బాలిక (A4) కూడా అతడికి సహకరిస్తూ వేధింపుల్లో భాగమయ్యారు.ఈ క్రమంలో 2018 ఏప్రిల్ 3న ఇంట్లో మరోసారి గొడవ జరిగింది. అదనపు డబ్బు తీసుకురాలేనని హేమలత చెప్పడంతో ఆగ్రహానికి గురైన నిందితులు ఆమెపై దాడికి దిగారు.
తీవ్రంగా గాయపడిన హేమలతను ముందుగా సిరిసిల్ల ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత ఆమె మరణించింది.ఈ ఘటనపై రుద్రంగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర ఆధారాలను సేకరించి నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ముగ్గురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ కేసులో మరో నిందుతురాలు మైనర్ బాలిక(16) కావడంతో ఆమెపై స కేసు జువెనైల్ న్యాయస్థానంలో విచారణలో ఉంది.