సమైక్య పాలనలో డయాలసిస్ పేషెంట్లు చికిత్స కోసం అరిగోసపడేది. హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాల్లోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ధారపోస్తూ ఆర్థికంగా చితికి పోవాల్సి వచ్చేది. కానీ స్వరాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇదేకోవలో జగిత్యాల ఏరియా దవాఖానతో పాటు ధర్మపురి, కోరుట్ల పీహెచ్‌సీల్లోనూ రక్తశుద్ధి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. చెంతనే ఖరీదైన చికిత్సను ఉచితంగా అందిస్తుండడంతో ఈ ప్రాంత రోగులకు వరంలా మారింది.
– జగిత్యాల, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా గోదావరిఖనికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొంకటి లక్ష్మీనారాయణ నియామకమయ్యారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్ చైర్మన్, సభ్యులను ఎంపిక చేయగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆయనకు అవకాశం లభించింది. బీఆర్ఎస్లో మొదటి నుంచి క్రియశీల సభ్యుడిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ 2014లో రామగుండం కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా పనిచేశారు. కాగా, త్వరలోనే ఎస్సీ, ఎస్టీ సభ్యుల నియామకపు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. – గోదావరిఖని, సెప్టెంబర్ 21
జగిత్యాల, సెప్టెంబర్ 21, (నమస్తే తెలంగాణ) : మూత్రపిండాలు మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. అయితే మారిన వాతావరణ పరిస్థితులు, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్ల నేపథ్యంలో కొంతకాలంగా కిడ్నీ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న ది. కిడ్నీలు దెబ్బతింటే మార్పిడి చేయించుకోవడం, లేదంటే డయాలసిస్ తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఈ రెండు ప్రక్రియలు అత్యంత ఖరీదైనవి. కిడ్నీ మార్పిడి ఖరీదైన ఆపరేషనే కాక, కిడ్నీ దొరకడం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో డయాలసిస్ మాత్రమే ఏకైక పరిష్కారం. అయితే దశాబ్దం కిందటి వరకు డయాలసిస్ సెంటర్లు హైదరాబాద్‌కే పరిమితమయ్యేవి. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాల్లోని ప్రైవేట్ దవాఖానాల్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే అత్యంత ఖరీదైన చికిత్స ఇది.
పేషెంట్ పరిస్థితిని బట్టి వారంలో ఒకటి నుంచి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చేది. ఒక్కో సిట్టింగ్‌కు రూ. 5 నుంచి 10 వేల వరకు ఖర్చుపెట్టాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఆర్థిక స్థోమతలేని అనేక మంది రోగులు మృత్యువాత పడ్డారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యశాలల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2017 చివరలో జగిత్యాల ఏరియా దవాఖానలో డయాలసిస్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఆరు మిషనరీలను ఏర్పాటు చేశారు. ఒకటి హెచ్ఐవీ రోగులకు కేటాయించారు. ఐదు మిషన్లపై సాధారణ కిడ్నీ రోగులకు డయాలసిస్ చేస్తూ వచ్చారు. ఐదేండ్ల కాలంలో రోజుకు పది మంది చొప్పున ఇప్పటి వరకు ఐదువందల మందికి డయాలసిస్ చేస్తూ వచ్చారు. ఒక్కొ రోగికి ఏడాదికి సగటున 120 సార్లు డయాలసిస్ చేస్తుండటం గమనార్హం.
జగిత్యాల జిల్లాలోనే మూడు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి రోజుకు వందకు పైగా రోగులకు డయాలసిస్ చేసే అవకాశం రావడంతో భరోసా లభించింది. గతంలో వారానికి కిడ్నీ బాధితులు మూడు నాలుగుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చేది. సగటున వారానికి రూ. 10 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి నుంచి మూత్రపిండ వ్యాధిగ్రస్తులను సీఎం కేసీఆర్ బయటపడేశారు. ఒక్కరూపాయి ఖర్చు లేకుండా, భోజన సదుపాయం కల్పించి మరీ డయాలసిస్ చేయిస్తుండడంతో కిడ్నీ రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆయుష్షుకు భరోసాను ఇవ్వడంతో పాటు, తమ బతుకుకు మార్గం చూపుతున్న సీఎం కేసీఆర్ దేవుడని వారు ప్రశంసిస్తున్నారు.
నా వయస్సు 24 సంవత్సరాలు. రెండేండ్ల క్రితం కాలుకు పుండు అయింది. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్లిన. అతడు సూచించిన యాంటీబయోటిక్స్ వాడడంతో కిడ్నీ సమస్య తలెత్తింది. పెద్ద డాక్టర్ల వద్దకు వెళ్లగా పరీక్షలు చేసి కిడ్నీలు దెబ్బతిన్నాయని, డయాలసిస్ చేయించుకోవాలని సూచించారు. దీంతో డయాలసిస్ మొదట వారానికి రెండు మూడుసార్లు హైదరాబాద్, కరీంనగర్ వెళ్తుండేదానిని. పోయినప్పుడల్లా రూ.3 వేలు ఖర్చయ్యేది. ఇప్పుడు ధర్మపురి సర్కారు దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడే డయాలసిస్ చేయించుకుంటున్న. నెలకు రూ.20 నుంచి రూ.30 వేల ఖర్చు తప్పింది. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయించిన సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్‌కు కృతజ్ఞతలు.
– రాచర్ల మంజుల, దొనూర్, ధర్మపురి
డయాలసిస్ పేషెంట్లకు మరింత చేరువగా డయాలసిస్ చికిత్స అందించేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పుడు కోరుట్ల, ధర్మపురి ఏరియా దవాఖానాల్లోనూ డయాలసిస్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఏడాది క్రితం జగిత్యాలకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే కోరుట్లకు డయాలసిస్ యూనిట్ ఇవ్వాలని విన్నవించారు. అడిగిన వెంటనే అమాత్యుడు డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేసి ఆరు యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకు అరవై మందికి డయాలసిస్ చేస్తున్నారు. తదనంతరం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలోనూ డయాలసిస్ ఏర్పాటు చేయించారు. ఇక్కడ రోజుకు ముగ్గురికి డయాలసిస్ చేస్తున్నారు.
కోరుట్లలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లో బాధితులకు నిరంతరం సేవలందిస్తున్నాం. సింగిల్ యూజ్డ్ వస్తువులతో చికిత్స అందిస్తున్నాం. రోగులకు మోటివేషన్, డైట్ ఫాలోయింగ్, ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తాం. ఐదు షిఫ్ట్‌ల ద్వారా రోజుకు 22 మంది పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నాం. ఒక్క డయాలసిస్ మిషన్ రూ. 8 లక్షల వరకు ఉంటుంది. ప్రతి పేషంట్‌కు ఒక్కసారి డయాలసిస్ చేసేందుకు ప్రభుత్వం రూ. 2500, సింగిల్ యూజ్డ్ పరికరాల కోసం రూ. 5 వేలు, నెలలో 4 సార్లు అందించే బ్లడ్ ఇంజక్షన్ కోసం మరో రూ. 20 వేలు, ఉచితంగా రక్త పరీక్షల కోసం వెచ్చిస్తున్నది. నెలలో 10 సెషన్ల కోసం రూ. 50 వేలు వెచ్చిస్తున్నది. ప్రైవేట్ దవాఖానాల్లో నెలకు రూ. 90 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
– రామకృష్ణ ,టెక్నీషియన్ (కోరుట్ల డయాలసిస్ సెంటర్)
.. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు బొలిశెట్టి సునీత. ఈమెది మల్లాపూర్ మండలం కుస్తాపూర్. భర్త పోశెట్టి ట్రాక్టర్ డ్రైవర్. సునీత బీడీ కార్మికురాలు. నిరుపేద కుటుంబం. కష్డపడుతూ ఇద్దరు పిల్లలను పెంచిపోషించుకుంటున్నారు. ఐదేండ్ల క్రితం వరకు కాయకష్టం చేసుకుంటూ ఉన్నంతలో నిశ్చింతగా బతుకుతున్న తరుణంలో సునీత తీవ్ర అస్వస్థతకు గురైంది. మెట్పల్లి, జగిత్యాల, హైదరాబాద్‌లోని పలు దవాఖానలకు వెళ్లగా, పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పారు. కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని, లేదంటే జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఆపరేషన్‌కు లక్షల రూపాయలు భరించేస్థోమతలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో డయాలసిస్ చేయించుకోవడం ప్రారంభించింది.
మొదట హైదరాబాద్‌లో డయాలసిస్ చేయించుకున్న ఆమె నాలుగేండ్లనుంచి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో డయాలసిస్ చేయించుకోవడం ప్రారంభించింది. వారానికి మూడు రోజుల చొప్పున ఏడాదికి కనీసం 150 సార్లు డయాలసిస్ చేయించుకునేది. ప్రతి సిట్టింగ్‌కు రూ. 5వేలు వెచ్చించాల్సి రావడంతో ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది. ఆస్తులను అమ్ముకున్నారు. అప్పుల భారం పెరిగిపోయింది. 2017లో జగిత్యాల ఏరియా దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఐదు యూనిట్లతో ఉన్న ఈ సెంటర్లో రెండు షిఫ్టుల్లో రోజుకు పదిమందికే డయాలసిస్ చేసే అవకాశం ఉండేది. అప్పటికే చాలా మంది స్థానిక కిడ్నీ బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సునీతకు అవకాశం రాలేదు.
విధిలేని పరిస్థితుల్లో నిజామాబాద్‌కే వెళ్లేది. ఈక్రమంలో ప్రభుత్వం కోరుట్ల ఏరియా దవాఖానలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రోజుకు 60 మంది పేషెంట్లకు డయాలసిస్ చేసే అవకాశం కలిగింది. సునీత సైతం అక్కడ పేరు నమోదు చేసుకున్నది. ఆరునెలలుగా ఇక్కడే డయాలసిస్ చేయించుకుం టున్నది. గతంలో వారానికి రూ. 10 వేలు ఖర్చు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు సీఎం కేసీఆర్ దయతో కోరుట్లలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కావడంతనకు వరంలా మారిందని చెబుతున్నది. ఇప్పుడు రానుపోనూ ఖర్చులు తప్ప ఒక్కరూపాయి కూడా కావడంలేదని పేర్కొంటున్నది. నాకు పింఛన్ ఇవ్వడమే గాకుండా ఇప్పుడు ఉచితంగా వైద్యమందుతున్నదని చెబుతున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ దయతోనేనని, ఆయన తమ కుటుంబానికి దేవుడిలాంటివాడని చెప్పింది.