రాజన్నసిరిసిల్ల, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు చరమగీతం పాడాలని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి.. ప్రస్తుతం వాటిని అమలు చేయకపోడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గతంలో చివరి గింజ వరకు ధాన్యం కొంటామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ప్రస్తుత కేబినెట్లో కేంద్రం ఇచ్చిన కోటా ప్రకారమే కొంటామని చెప్పడం రైతులను ద్రోహం చేసినట్లేనని మండిపడ్డారు.
‘బడేబాయ్ మోదీ.. చోటా బాయ్ రేవంత్’ ఇద్దరూ కలిసి తెలంగాణ రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. 33రకాల సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడే కేవలం ఏడు సన్నాలకే ఇస్తామని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో శనివారం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సిరిసిల్ల ఇన్చార్జి తుల ఉమతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ.. 2014కు ముందు తెలంగాణలో 1.34కోట్ల ఎకరాల ఆయకట్టు ఉంటే.. కేసీఆర్ హయాంలో మరో కోటి ఎకరాల ఆయకట్టు పెరిగిందన్నారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితిల్లోనూ ధాన్యం కొనుగోలు చేసి రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కానీ, రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.15వేల రైతుభరోసా ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్‌లను విలేకరులకు చూపిస్తూ రేవంత్ సర్కారు తీరును ఎండగట్టారు. రేవంత్‌రెడ్డి రియల్ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని.. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, నాయకులు కుంబాల మల్లారెడ్డి, బొల్లి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.