సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 23: ప్రజల ముందుకువస్తే కొట్లాడినట్టు నటించి.. తెర చాటున చిల్లర మాటల రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ చీకటి దోస్తాన చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆ ఇద్దరు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చదువురాని, సంస్కారంలేని వ్యక్తులు అయినందునే నీచమైన భాషను వినియోగిస్తున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటివరుసలో నిలిచిందని కొనియాడారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి కనీసం పావలావంతు రుణమాఫీ కూడా చేయకుండా.. రైతులను మోసం చేశాడని ఆరోపించారు.
కులగణన పేరిట బీసీలను మోసం చేసిన చీటర్ రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. సర్వేలో అగ్రవర్ణాల జనాభాను పెంచి.. బీసీల జనాభాను తగ్గించారని విమర్శించారు. సర్వే జాబితాను అన్ని సెంటర్లలో ప్రచురణ చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వాన్ని అదే రోజున ప్రజలే బొందపెడతారని జోస్యం చెప్పారు. రేవంత్ తరహాలోనే చదువు, సంస్కారం లేని వ్యక్తి బండి సంజయ్ అని మండిపడ్డారు. ప్రజా సమస్యల గురించి నిలదీయాల్సిన ఆయన.. కేటీఆర్‌ను ఉద్దేశించి చిల్లరగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రజా సమస్యలపై కొట్లాడితే ప్రజలే నిన్ను స్వాగతిస్తారని హితవు పలికారు. రైల్వే ప్రాజెక్టులు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, పరిశ్రమలకు రాయితీలు, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదాపై బండి సంజయ్‌కి ఏ మాత్రం ధ్యాసలేదన్నారు. జిల్లాలో ఓ అధికారిని అడ్డుపెట్టుకుని స్థానిక నేతలు ఆది శ్రీనివాస్, కేకే మహేందర్‌రెడ్డి ప్రజలపై తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో ఏదో జరుగుతుందన్నట్టు కల్పిత ప్రచారాలు చేశారని, అనేక మంది బీఆర్ఎస్ నాయకులు, రైతులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారన్నారు. మహేందర్‌రెడ్డికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లంతా సన్నిహితులే అయినప్పుడు.. మల్కపేట ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలి ఎల్లారెడ్డిపేట మండలంలోని చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ప్రజలు ఓడించారనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. పాడి రైతులకు సంబంధించిన మిల్క్ చిల్లింగ్ సెంటర్‌ను మూసి వేయించారని, రైతులు ఎక్కడికక్కడ చేసిన ధర్నాలతో హంతకుడే సంతాపం తెలిపిన విధంగా కాంగ్రెస్ నాయకులే దగ్గరుండి తిరిగి తెరిపించారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా క్షేత్రంలో కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌కు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ బండ నర్సయ్యయాదవ్, కుంబాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, సత్తార్, అడ్డగట్ల మురళి, వెంగళ శ్రీనివాస్‌పాల్గొన్నారు.