Ramagundam | కోల్ సిటీ, ఫిబ్రవరి 12 : రామగుండం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం గోదావరిఖని శారదానగర్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి గానీ, లేదంటే అభ్యర్థి తరపున ఒక్కరే ఏజెంట్ కు అనుమతి ఉంటుంది. రామగుండంలోని 59 డివిజన్లలో బుధవారం మొత్తం 1,23,616 ఓట్లు పోలయ్యాయి. వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్లో 467 ఓట్లు ఇప్పటివరకు పోలయ్యాయి. తపాల ద్వారా మరిన్ని ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. కాగా రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఉదయం 8 గం.లకు ముందుగా పోస్టల్ బ్యాలెట్లోని 467 ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
ఆ తర్వాత 59 డివిజన్లకు సంబంధించి 272 బ్యాలెట్ బాక్సులలో వచ్చిన ఓట్లను అభ్యర్థుల సమక్షంలోనే డివిజన్ల వారీగా ఓపెన్ డబ్బాలో కుప్పలుగా పోస్తారు. వాటిలో నుంచి 25 ఓట్ల చొప్పున తీసి కట్టలుగా విభజిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అలా 25 ఓట్ల చొప్పున ఉన్న కట్టల నుంచి ఒక్కో రౌండ్ కు 40 బెండల్స్ తీసి ఓట్లను లెక్కించి మొదటి రౌండ్ ఫలితాలుగా ప్రకటిస్తారు. దాదాపు వెయ్యి, ఆపై చిలుకు ఓట్లు ఉంటే కేవలం రెండు రౌండ్లలో తుది ఫలితాలు వస్తాయి. 2వేలకు, పై చిలుకు ఓట్లు ఉంటే మూడు లేదంటే నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది.
ప్రతీ రౌండ్లో ఒక్కో డివిజన్ కు సంబంధించి 40 బెండల్స్ తీసి అభ్యర్థులకు చూపిస్తూ గుర్తు ల వారీగా ఉన్న బాక్సులో వేసి అనంతరం వాటిని లెక్కించి మొదటి రౌండ్ గా ప్రకటిస్తారు. ఇదే తరహాలో మూడు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను దాదాపు ముగిస్తారు. మధ్యాహ్నం 3 గం.ల కల్లా అన్ని డివిజన్ల ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏ అభ్యర్థికైనా అనుమానం వచ్చి సరియైన కారణంతో రాత పూర్వకంగా రిటర్నింగ్ అధికారికి అభ్యర్థిస్తే రీ కౌంటింగ్ కు ఆదేశిస్తారు. ఒకవేళ ఏదైనా డివిజన్లో రీ కౌంటింగ్ అనివార్యమైతే ఆ ప్రక్రియ పూర్తయ్యాకనే ఫలితాలను వెల్లడిస్తారు. దీంతో రామగుండం బల్దియా పాలక వర్గం ఎన్నికల ఘట్టం పూర్తిగా ముగిసిపోతుంది.