వెల్గటూర్, మే 12: ‘ వరి, మక్క లాంటి బయో ఉత్పత్తుల ఆధారంగా నిర్మించే ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనర్థాలు కలుగుతాయని అవగాహనలేనివారు చెప్పే మాటలను నమ్మద్దు. భయభ్రాంతులకు గురై ఆందోళన చెందవద్దు’ అని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో అనేకమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. శుక్రవారం వెల్గటూర్ మండలం స్తంభంపల్లి, పాశిగాం గ్రామస్తులతో సమావేశమయ్యారు. క్రిభ్కో సంస్థ డైరెక్టర్ పొన్నం ప్రభాకర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ప్రతినిధులతో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన పర్లపల్లి ఫ్యాక్టరీని చూసి భయపడవద్దన్నారు. అది 2006లో తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినదని, కానీ ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ క్రిబ్కో ఆధ్వర్యంలో అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్నదన్నారు. ఎలాంటి కాలుష్యం ఉండదని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమ 10 వేల మంది రైతుల సొసైటీలతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇంత నష్టం ఉంటే ప్రధాని మోదీ తన సొంతరాష్ట్రం గుజరాత్, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. గొప్ప కంపెనీ మన ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అదృష్టంగా భావించాలన్నారు. అకాల వర్షాలతో తడిసిన, ముక్కిపోయిన ధాన్యం కూడా కంపెనీ కొనుగోలు చేసి రైతులకు మేలు చేస్తుందని ప్రోజెక్టర్ ద్వారా ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ భాస్కర్, ఆర్డీవో మాధురి, కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా స్వాగతించాలి
ఒక్క నీటి చుక్క, పోగ కూడా రాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నాం. రాజకీయాలకతీతంగా ప్రతిఒక్కరూ స్వాగతించాలి. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, రైతుల శ్రేయస్సు కోసం నిర్మిస్తున్నాం. కొందరు స్వార్థపరులు మిమ్మల్ని తప్పుదోవపట్టిస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరించాలి.
– పొన్నం ప్రభాకర్, క్రిభ్కో సంస్థ డైరెక్టర్
పరిశ్రమతో ప్రాంతం అభివృద్ధి
కంపెనీ రైతు సొసైటీల భాగస్వామ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. దీనిద్వారా ఎవరీకి నష్టం ఉండదు. రైతులతకు ఎంతో మేలు జరుగుతుంది. వేలాదిమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాంతంలో బడి, గుడి, దవాఖాన, కమ్యూనిటీ హాల్స్, రోడ్లు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. మీకు అనుమానం ఉంటే ప్రత్యక్ష పరిశీలనకు పంపి నివృత్తి చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నది.
– కొండూరి రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్