హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): తమ రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదలపై పగబట్టారని, అందుకే పేదల ఇండ్లను టార్గెట్ చేసుకుని, కూల్చివేస్తున్నారని అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలపై ఉన్న పగతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా కేంద్రంలో 600 మంది నిరుపేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు పేదలకు అనుకూలంగా మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదల ఇండ్లనే కూల్చివేస్తున్నారని దుయ్యబట్టారు. రియల్ఎస్టేట్ వ్యాపారం కోసమే హైదరాబాద్, లగచర్ల, ఖమ్మం వంటి అనేక ప్రాంతాల్లో పేదలనే లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మంలో ఇంత జరుగుతుంటే.. ఆ జిల్లా మంత్రులు మాట్లాడే విధానం సిగ్గుపడేలా ఉన్నదని దుయ్యబట్టారు. ఖమ్మంలోని 60 ఎకరాల భూదాన్ భూములను ఎవరికి కట్టబెట్టేందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని నిలదీశారు.
కుమ్మెర జాతరలో జరిగిన ఘటన అమానుషమని, ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థలో దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతున్నదని, కాంగ్రెస్ నాయకులు చెప్తేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని విమర్శించారు. కుమ్మెర జాతర విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, బీఆర్ఎస్ నేతలు సుమిత్రానంద్, లోక బాపురెడ్డి, మంజులారాణి పాల్గొన్నారు.