అనుకున్నట్టుగానే ఆగస్టులో యూరియా లోటు ఏర్పడింది. ప్రభుత్వం ప్రణాళిక లేమి, అధికారుల అలసత్వంతో కొరత తీవ్రమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎరువుల కోసం రైతన్న దినదినం ఏ బాధైతే పడ్డాడో.. ఇప్పుడు మళ్లీ అదే నరకం చూడాల్సి వస్తున్నది. సొసైటీల ముందు చెప్పులు పెట్టి పడిగాపులు పడే దుస్థితి వచ్చింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు కరీంనగర్ జిల్లాలో 16,700 మెట్రిక్ టన్నులు వినియోగం జరిగిందని, ఇది గతేడాది కంటే ఎక్కువ అని యంత్రాంగం చెబుతున్నా, రైతాంగం మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉంది. అధికారుల లెక్కల ప్రకారం ఈ రోజు వరకు రిటైల్, మార్క్‌ఫెడ్ వద్ద కలిపి కేవలం 2,102 మెట్రిక్ టన్నులే నిల్వ ఉండగా, ప్రస్తుత వినియోగాన్ని బట్టి అది నాలుగు రోజులకు సరిపోనున్నది. ఈ నెల కోసం మరో 5 వేల మెట్రిక్ టన్నుల కోసం ఇండెంట్ ఇచ్చామని, కొరత లేకుండా చూస్తామని యంత్రాంగం చెబుతున్నా, ప్రభుత్వం కేటాయిస్తుందా.. లేదా..? అన్నది వేచి చూడాల్సి ఉన్నది.
కరీంనగర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): జూలై 27న శంకరపట్నం మండలం కన్నాపూర్‌లోని సింగిల్ విండో గోదాంకు యూరియా వచ్చిందని వెళ్లిన రైతులకు నిరాశే ఎదురైంది. మధ్యాహ్నం వరకే స్టాక్ అయిపోవడంతో చేసేది ఏమీ లేక రైతులు వెనుదిరగాల్సి వచ్చింది. అదే నెల 29న ఇదే మండలం మెట్పల్లి సింగిల్ విండో పరిధిలోని గోదాం వద్ద రైతులు చెప్పులు లైన్లో పెట్టాల్సి వచ్చింది. అయినా చివరి రైతుకు యూరియా దొరకని పరిస్థితి. ఈ నెల 2న గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రానికి వెళ్లిన రైతులకు నో స్టాక్ బోర్డు కనిపించడంతో ఆందోళనకు దిగారు. యూరియా బస్తాలు ఏమయ్యాయని అక్కడికి వచ్చిన అధికారులను నిలదీశారు. బుధవారం సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్లోనూ ఇదే పరిస్థితి. రైతులు ఉదయం నుంచే చెప్పలు లైన్లో విడిచి వచ్చిన పరిస్థితి. వీణవంక మండలం నర్సింగాపూర్‌లో అయితే పోలీస్ పహారా మధ్య పంపిణీ చేయాల్సి వచ్చింది. ఇలా రోజుకో చోట ఎరువుల కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఈ నెలలో తీవ్రమైన కొరత ఏర్పడుతుందని గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం అక్షరాల నిజం అవుతున్నది. ఎరువులు ముఖ్యంగా యూరియా గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారులు ఉదాసీనంగా వ్యహరించడంతో రైతులు తిప్పలు పడాల్సి వస్తున్నది. సింగిల్ విండోలు, రిటైల్ డీలర్ దుకాణాల్లో ఎక్కడ చూసినా ఇపుడు యూరియా లేదనే మాటలే వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం జిల్లాలోని రిటైలర్లు, మార్క్‌ఫెడ్ వద్ద కేవలం 2,102 మెట్రిక్ టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. జిల్లాలో రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల యూరియా వాడకం జరుగుతున్నది. ఇలా చూస్తే ఇప్పుడున్న యూరియా కేవలం ఐదు రోజులకే సరిపోతుంది. ఇప్పటికే సొసైటీలు, ఆగ్రో సెంటర్ల వద్ద రైతులు నిత్యం పడిగాపులు పడుతున్నారు. నిజానికి ఈ నెలలోనే పత్తి, వరి, మక్క పంటలకు రైతులు యూరియాను విరివిగా వాడతారు. ఈ సమయంలోనే ప్రభుత్వం సమయ స్ఫూర్తిగా వ్యవహరించి సరిపడా యూరియా, ఇతర ఎరువులు నిల్వ చేయాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలో కేవలం 2,102 మెట్రిక్ టన్నులే ఉండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే సొసైటీ గోదాములు, ఆగ్రో, గ్రోమోర్ తదితర కేంద్రాల వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగానైతే చెప్పులు క్యూలో పెట్టి ఎరువుల కోసం నిరీక్షించారో అవే పరిస్థితులు తిరిగి పునరావృతం అవుతున్నాయి. నిజానికి ఈ నెలలో 15,139 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని సీజన్ ప్రారంభంలోనే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అధికారుల అంచనాలకు సరిపడా యూరియాను ప్రభుత్వం జిల్లాకు కేటాయించక పోవడంతోనే ఈ సమస్య వచ్చిందని రైతులు తీవ్రంగా మండి పడుతున్నారు.
సరిపడా యూరియా అందిస్తామని అధికారులు చెబుతున్నా రైతులకు నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే ఇప్పటికే అంచనాకు మించి జిల్లాకు యూరియా కేటాయింపులు జరిగినట్టు వ్యవసాయ శాఖ కమిషనరేట్ అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తున్నది. జిల్లాలో సాగైన పంటలను బట్టి ఏ పంటకు ఎంత యూరియా అవసరం ఉంటుందనేది అధికారులు సీజన్‌కు ముందే ప్రణాళికను రూపొందించుకుంటారు. దీని ప్రకారం జిల్లాకు 43,254 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వానకాలం సీజన్ లెక్కిస్తారు. దీనికి గాను ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఏ నెలలో ఎంత యూరియా అవసరం? అనేది ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కానీ, ఈ సారి అధికారుల అంచనాలు తలకిందులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సరిపడా ఎరువులు కేటాయించ లేదని స్పష్టమవుతున్నది. ఏప్రిల్‌లో ఓపెన్ బ్యాలెన్స్ చూస్తే.. 13,140 మెట్రిక్ టన్నులు ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరకొర కేటాయింపులు జరిగాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు 16,700 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగినట్టు తెలుస్తున్నది. అంటే ఓపెన్ బ్యాలెన్స్ చూస్తే ఇప్పటి వరకు 3,560 మెట్రిక్ టన్నుల మాత్రమే ప్రభుత్వం కొత్తగా కేటయించినట్టు తెలుస్తున్నది. సరిపడా కేటాయించకపోగా, గతేడాది కంటే ఈ సారి ఎక్కువగా వినియోగం జరిగిందని ఇక్కడి అధికారులనే సంజాయిషీ అడుగుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాకు మిగతా యూరియా కేటాయింపులు ఉంటాయా.. ఉండవా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం ఈ నెలలో మరో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని చెబుతున్నారు. అందులో భాగంగా రెండు రోజుల్లో 800 నుంచి 1,300 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. 2014కు ముందు విత్తనాల కోసం రైతులు పోలీస్ స్టేషన్లలో బారులు తీరాల్సి వచ్చేది. ఎరువుల కోసం సింగిల్ విండో గోదాముల్లో చెప్పులు పెట్టి పడిగాపులుకాచేది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మంది ఎరువుల బస్తాల కోసం బారులు తీరాల్సి ఉండేది. ఇపుడు అవే పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. గడిచిన పదేళ్లలో విత్తనాలు, ఎరువులకు ఎలాంటి కొరత రాలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో ఎరువుల కోసం రైతులు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులను ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు.