Ramagundam Baldia | కోల్ సిటీ, మే 15: రామగుండం నగర పాలక సంస్థలో ఏలాంటి అవినీతి, అక్రమాలకు తావు ఉండదు.. ఒకవేళ ఏమైనా లోపాలు తలెత్తితే నా దృష్టికి తీసుకవస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటా.. అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎసీ) జే. అరుణ శ్రీ స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రామగుండం నగర పాలక సంస్థలో అవినీతికి చోటు లేదనీ, నిర్ణీత వ్యవధిలోనే ఫిర్యాదుల పరిష్కారం, ధృవీకరణ పత్రాల జారీ తదితర అన్ని రకాల సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది నిజాయితీగా, సమర్ధవంతంగా సేవలందిస్తున్నారనీ, ఏమైనా లోపాలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎవరైనా లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నం. 1064, సెల్ నం.9440446106 అందరికీ తెలిసేలా తన ఆదేశాల మేరకు కార్యాలయంలో పలు చోట్ల నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోనే బోర్డులు ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. నగర పౌరులకు సుపరిపాలన అందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.