హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 5 : ఆస్తి కోసం ఓ తమ్ముడు దారుణానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులతో కలిసి అన్నను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం రాజపల్లికి చెందిన నోముల ఎల్లమ్మ, చంద్రయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. అవివాహితుడైన పెద్ద కొడుకు రాజు(35) ఇంటి వద్దనే ఉంటూ తన తల్లి పేరు మీద దళితబంధులో వచ్చిన ట్రాక్టర్ నడుపుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు.
చిన్న కొడుకు అంజి కొన్నేండ్ల కిందట ప్రేమ వివాహం చేసుకొని, హైదరాబాద్లో ఉంటూ కారు ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. అయితే, తమకున్న సుమారు నాలుగెకరాల భూమిని అంజి ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్నాడు. నాలుగు రోజుల క్రితం పండుగ కోసం ఇంటికి వచ్చి, తల్లిదండ్రులతో కలిసి అన్న హత్యకు వ్యూహం పన్నాడు. శుక్రవారం రాత్రి రాజుతో గొడవకు దిగి అతడిని బలమైన ఆయుధంతో హత్య చేశారు. ఇంట్లో పడుకున్న రాజు లేవడం లేదని శనివారం ఉదయం తల్లిదండ్రులు పక్కింటివారిని పిలిచి గదిలోకి వెళ్లి చూపించగా, తీవ్ర గాయాలతో విగతజీవిగా మంచపై పడి ఉన్నాడు.
మంచం కింద రక్తపు మడుగు ఉండడంతో ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ తిరుమల్, ఎస్ఐ యూసఫ్అలీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంను పిలిపించి వేలి ముద్రలు సేకరించారు. పంచాయతీ కార్యదర్శి కృపారాణి ద్వారా ఫిర్యాదు తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూరాబాద్ దవాఖానకు తరలించారు. కాగా, మృతుడి తల్లిదండ్రులు ఎల్లమ్మ, చంద్రయ్య, సోదరుడు అంజిని అదుపులోకి తీసుకొని విచారించగా, హత్య చేసిన విషయం బయటపడిందని సీఐ తెలిపారు.