మానకొండూర్ రూరల్, నవంబర్ 28 : తమ గ్రామం మీదుగా ఇసుక లారీలను నడపొద్దని అన్నారం గ్రామ మహిళలు డిమాండ్ చేశారు. దుమ్ము,ధూళి పెరిగి ఆరోగ్యం చెడిపోతున్నదంటూ శుక్రవారం గ్రామంలో ఇసుక లారీలను అడ్డుకొని ధర్నా చేశారు. సుమారు అరగంట పాటు రోడ్డుపై బైఠాయించారు. సీఐ సంజీవ్ సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తానని, హామీనివ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
ఇసుక లారీల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ధర్నా చేసినట్లు చెప్పారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి, సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.