Godavarikhani | కోల్ సిటీ, జూలై 25: పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో డ్రైడే ఫ్రైడే నిర్వహించి గోలాలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలలో నిల్వ ఉన్న నీటిని శుక్రవారం తొలగించారు. వెంకట్రావుపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన స్థానికులతో మాట్లాడారు. నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు.
దోమ కాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పల్లె దవాఖాన సందర్శించి జ్వర పీడితుల వివరాలు సేకరించారు. జ్వర పీడితులు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని సిబ్బందికి నసూచించారు. అలాగే పలు డివిజన్లలో నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేయించి ఫాగింగ్ చేశారు. టేలాండ్ ప్రాంతాల్లో తాగునీటికి క్లోరిన్ పరీక్షలు చేశారు. స్థానిక బస్టాండ్ ఏరియా పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమాలలో శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కిరణ్, మెప్మా సీడీ ఊర్మిళ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, వార్డు అధికారులు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.