వేసవి సెలవులు కావడంతో రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. దర్శనం సంగతేమో గానీ, సౌకర్యాలు లేక నరకం చూస్తున్నారు. ఐదు రోజులుగా జనరేటర్ పనిచేయక పవర్ కట్ అయినప్పుడల్లా ఉకపోతతో ఉకిరి బికిరి అవుతున్నారు. వసతి గదుల్లో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయక, కోడెమొకుల క్యూ లైన్ కాంప్లెక్స్‌లోనూ ఫ్యాన్లు తిరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనరేటర్ పనిచేయదని తెలిసినప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదని మండిపడుతున్నారు.
వేములవాడ, మే 27: వేసవి సెలవుల సందర్భంగా రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రతిరోజూ వేలాది మంది తరలిరావడం కనిపిస్తున్నది. ఎండకాలం కావడంతో భక్తులు ఏసీ వసతి గదులకే ప్రాధాన్యతనిస్తూ భీమేశ్వర సదన్ ఏసీ గదుల్లో విడిది చేస్తున్నారు. అయితే జనరేటర్ పనిచేయక విద్యత్ కట్ చేసినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నారు. రాజన్న ఆలయానికి మూడు జనరేటర్లు ఉన్నాయి. అందులో ఒకటి 250 కేవీఏ, మరో రెండు 125కేవీఏ జనరేటర్లు ఉన్నాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు 250 కేవీఏ, 125కేవీఏతో ప్ర ధానాలయం, అనుబంధ ఆలయాలు, పరిపాలన కార్యాలయం, భీమేశ్వర సదన్ (ఏసీ), పార్వతీపురం వసతి గదులు, పంపు మోటర్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. నందీశ్వర, లక్ష్మీ గణపతి వసతి గదుల సముదాయంతోపాటు విచారణ కార్యాలయం కోసం మరో 125కేవీఏ అందుబాటులో ఉన్నది.
ప్రస్తుతం 250 కేవీఏ జనరేటర్ ఐదు రోజులుగా పనిచేయడం లేదు. దానిని రిపేర్ చేయాలని టెక్నికల్ సిబ్బందికి అధికారులు సూచించారు. ఇది అందుబాటులోకి రావడానికి మరో మూడు రోజుల పట్టే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఆకస్మికంగా విద్యుత్ కట్ అవుతున్న తరుణంలో భీమేశ్వర సదన్ (ఏసీ), పార్వతీపురం వసతి గదుల సముదాయాలకు విద్యుత్‌ను అందించలేకపోతున్నారు. ఆదివారం రెండున్నర గంటలపాటు కరెంట్ నిలిచిపోగా.. భక్తులు ఉక్కపోతతో ఆగమయ్యారు. ఎండ వేడి ఉందని ఏసీ గదులు తీసుకున్నా ఏం ప్రయోజనముందని వాపోతున్నారు. జనరేటర్ రిపేర్‌లో ఉన్నప్పుడు తాతాలిక ఏర్పాట్లు ఎందుకు చేయలేదని మండిపడుతున్నారు.
సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవలే భక్తుల వసతి సదుపాయాలపై సమీక్ష నిర్వహించినా అధికారులు తీరు మాత్రం మారడం లేదు. అసలే ఎండకాలం, పైగా భక్తుల రద్దీ.. ఈ సమయంలో వేడితో ఇబ్బంది పడుతున్నా కనీస ఏర్పాట్లను చేయడం లేదు. ఏడాదికి 20కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెట్టే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కోడె మొక్కుల కోసం దర్శించుకునే భక్తులు రాజేశ్వరపురం కట్ట మీదుగా ఉన్న క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయ ఓపెన్ స్లాబ్ కాంప్లెక్స్‌లో టికెట్‌ను తీసుకొని నేరుగా రాజ న్న ఆలయంలోకి వెళ్తారు. ఆది, సోమవారాల్లో భక్తులు 5నుంచి 6 గంటల సమయం పడుతున్నదని, కనీసం ఫ్యాన్లు కూడా తిరగడం లేదని భక్తులు వాపోతుననారు. వేడి, ఉకపోతతో పిల్లలు సైతం ఇబ్బంది పడుతున్నార ని మండిపడుతున్నారు. తిరగని ఫ్యాన్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
జనరేటర్ ఐదు రోజులుగా రిపేర్ లో ఉంది. వసతి గదులు మినహా ప్రధాన ఆలయానికి, అనుబంధ ఆలయానికి అదనపు జనరేటర్ ద్వారా అత్యవసర పరిస్థితులలో విద్యుత్‌ను అందిస్తున్నాం. భీమేశ్వర సదన్, పార్వతీపురం గదులకు మాత్రం ఇవ్వడం సాధ్యం కావడం లేదు. రెండు మూడు రోజుల్లో జనరేటర్ రిపేర్‌ను పూర్తి చేసి అందుబాటులో తీసుకువస్తాం.
-రాజేశ్, ఈఈ (రాజన్న ఆలయం)
రాజన్న కోడె మొక్కు చెల్లించుకునేందుకు క్యూలో నిల్చుంటే ఐదు గంటల సమ యం పట్టింది. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ పూర్తిగా అధ్వానంగా ఉన్నది. కనీసం ఫ్యాన్లు కూడా తిరగడం లేదు. ఉకపోతతో మస్తు ఇబ్బంది పడ్డం. చిన్నపిల్లలు ఐదు గంటలు నరకం చూసిన్రు.
– సంతోష్ రెడ్డి, చందలాపూర్ (సిద్దిపేట జిల్లా)