“రాష్ట్ర ప్రభుత్వం మీతోనే ఉన్నది. ఆందోళన వద్దు. అండగా ఉంటం. ధైర్యంగా ఉండండి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నరు. నష్టపోతే ఎకరానికి 10 వేల పరిహారం అందిస్తం. పంట కోసిన తర్వాత మిగిలిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుంది. ముఖ్యమంత్రిపై నమ్మకం ఉంచండి. రైతు బిడ్డ, సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు ఇబ్బందులు ఉండవు. పెద్దన్నగా మిమ్మల్ని ఆదుకుంటరు.” అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో దెబ్బతిన్న పంటలను, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
-రాజన్న సిరిసిల్ల, మే2 (నమస్తే తెలంగాణ)
సిరిసిల్ల/ సిరిసిల్ల టౌన్/ కలెక్టరేట్/ తెలంగాణచౌక్, మే 2 : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టం వివరాలు అడిగి తెలుసుకుని రైతుల్లో ధైర్యం నిం పారు. అనంతరం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. రైతు బిడ్డ సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు, ప్రజల కష్టాలు తెలిసిన నాయకులని తెలిపారు. రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా ఉండడంతో గుంట భూమి కూడా పడావు పడకుండా రైతులు ధాన్యం పండించారని, ఇబ్బడిముబ్బడిగా జలవనరులు పెరిగాయంటే దానికి కారణం సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో దాదాపు 17 వేల మంది రైతులకు సంబంధించి 19 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని గుర్తించామన్నారు.
దేశంలో హెక్టారుకు రూ.25 వేల పంట నష్ట పరిహారం అందిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా రైతుల పక్షపాతిగా ఇలాంటి సహాయం చేయలేదని వ్యక్తపరిచారు. సీఎం కేసీఆర్ నాయకత్వ పనితీరుపై అవగాహన ఉన్న వారు ఇది రైతు ప్రభుత్వమని చెపుతారని స్పష్టం చేశారు. ఇటీవల 8 గంటల పాటు జరిగిన పార్టీ ప్లీనరీలో దాదాపు నాలుగున్నర గంటల పాటు రైతులు, రైతు సమస్యలు, జలవనరులు, వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పురోగమనంలోకి ఎలా తీసుకుపోతున్నది, మిగతా రాష్ర్టాలు వ్యవసాయ సంక్షోభంతో ఎలా తల్లడిల్లుతున్నాయనే అంశాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ విధానం, జల వనరుల వినియోగం దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న దానిపై ముఖ్యమంత్రి చర్చించారని చెప్పారు.
సీఎం కేసీఆర్‌పై రాష్ట్రంలోని ప్రతి రైతు నమ్మకం, విశ్వాసంతో ఉండాలని కోరారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని, రైతుకు భరోసానిచ్చే ప్రభుత్వమని స్పష్టం చేశారు. పంటల పరిశీలన తర్వాత తాను మంత్రి గంగుల కమలాకర్‌తో ధాన్యం కొనుగోలు విషయమై మాట్లాడానని, అందుకు ఆయన రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 7.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, గత సంవత్సరం మే వరకు నాలుగు లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు చెప్పారని తెలిపారు. కొనుగోళ్లు మరింత వేగవంతం చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుకు భరోసానిచ్చే కార్యక్రమంలో భాగంగానే బీఆర్ఎస్ నేతలు అందుబాటులో ఉంటున్నారని, అధికారులు ఇప్పటికే పంట నష్టంపై ప్రాథమిక అంచనా వేస్తున్నారని చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, అడిషనల్ కలెక్టర్లు సత్యప్రసాద్, ఖిమ్యానాయక్, జిల్లా వ్యవసాయాధికారి రణధీర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఉన్నారు.