MINING | రామగిరి మార్చి 28: సింగరేణి సంస్థ రామగుండం-3 ఏరియా లోని ఓసిపి-2 ఉపరితల గనిని శుక్రవారం డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్య నారాయణ సందర్శించారు. రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అధికారులు ముందుగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ఉపరితల గని యొక్క ఉత్పత్తి, రవాణా, యంత్రాల వినియోగం తదితర వివరాలు తెలుసుకున్నారు. తదుపరి వ్యూ పాయింట్ నుంచి క్వారీలో నడుస్తున్న పనులను పరిశీలించారు. యంత్రాల వినియోగంతో పాటు నిర్దేశించిన లక్ష్యాలను సాధించుటకు రూపొందించిన ప్రణాళికలు, తీసుకొంటున్న భద్రతా చర్యలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు డైరెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ రోజు వారీ నిర్దేశిత మట్టి వెలికితీత, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించాలని యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించి, బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా, భద్రతతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా సాధించడానికి ఉద్యోగులందరూ సమిష్టిగా కృషి చేయాలని, వేసవి కాలంలో పెరుగనున్న ఉష్ణోగ్రతలకు అణుగుణంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వారితో పాటు ఎస్వోటు జీఎం, ఇంచార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జీ రఘుపతి, ప్రాజెక్ట్ ఇంజినీర్ చంద్రశేఖర్, మేనేజర్ కె.వి.రామారావు, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షబ్బిరుద్దీన్, అధికారులు కోల శ్రీనివాస్, రవీందర్, శ్యామల తదితరులు ఉన్నారు.