ఒకప్పుడు దట్టంగా ఉన్న జగిత్యాల జిల్లాలోని అడవులు పలుచగా మారాయి. సారంగాపూర్, రాయికల్, కొడిమ్యాల, మేడిపల్లి, కథలాపూర్, ధర్మపురి ప్రాంత అడువులు పూర్తిగా మైదాన ప్రాంతాలుగా మారిపోయాయి. విలువైన వృక్షజాలం, ఆయుర్వేద మొక్కలు, అనేక జీవరాశులు, పశు పక్షాదులతో విలసిల్లిన ఈ ప్రాంతాలు క్రమంగా ఉనికిని కోల్పోయాయి. కానీ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో అడవులు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసకున్న చర్యలతో అటవీ తిరిగి చిగురిస్తున్నది.
జగిత్యాల, జూలై 10, (నమస్తే తెలంగాణ) : అటవీ శాఖ జగిత్యాల జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాన్ని జగిత్యాల, మెట్పల్లి, కొడిమ్యాల, ధర్మపురి, రాయికల్ రేంజ్‌లుగా వర్గీకరించింది. ఈ ఐదు రేంజ్‌ల పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు దట్టమైన అటవీ సంపద ఉండేది. కాలగమనంలో అది తగ్గిపోయింది. తగ్గిపోయిన అటవీ చిక్కదనాన్ని పెంచేందుకు అటవీ శాఖ అధికారులు ఐదు రకాల పద్ధతుల్లో ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల చుట్టూ రక్షణ కోసం గచ్చకాయ ప్లాంటేషన్ పద్ధతిని అమలు చేస్తున్నారు. త్వరగా పెరిగి, విస్తరించే స్వభావమున్న ఈ చెట్లను అటవీ ప్రాంతం చుట్టూ కందకాలు తీసి, ఆ కందకాలకు ముందు భాగంలో నాటుతున్నారు. ఈ చెట్లకు ఉన్న ముండ్ల కారణంగా మనుషులు అటవీభూముల్లోకి వెళ్లే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇలా పలు పద్ధతులను అవలంబిస్తు అటవీ ప్రాంతాన్ని వృద్ధి చేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో కొన్ని టేకు చెట్లను, ఎక్కువ కొమ్మలు ఉన్న వాటిని తొలగించి, టేకు చెట్లను పొడవుగా, ఏపుగా పెంచి అడవిని చిక్కబరిచే ప్రక్రియ చేపడుతున్నారు.
కొడిమ్యాల అటవీ ప్రాంతమే ఉదాహరణ..
వన సంరక్షణ విధానం ఎలా ఉందో చెప్పడానికి కొడిమ్యాల రేంజ్ పరిధిలోని దేశాయిపేట అటవీ ప్రాంతమే ఒక ఉదాహరణ. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మించిన సమయంలో అటవీ శాఖకు చెందిన భూమిని ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయంగా దేశాయిపేట శివారులో ఉన్న దాదాపు 331 ఎకరాల రెవెన్యూస్థలాన్ని ప్రభుత్వం అటవీశాఖకు అప్పగించింది. అందులో అడవిని వృద్ధిని చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయంలో సమస్యలు ఎదురైనా అధికారులు అధిగమించారు. 331 ఎకరాల్లో 12వేల మొక్కలు నాటారు. నాటిన మొక్కలు అన్ని లోకల్ జాతికి చెందినవే. అక్కడి మృత్తిక రకానికి అనుకూలమైన రావి, మర్రి, అల్లనేరేడు, నెమలినార, ఉసిరి, తెల్లమద్ది, ఏగీత, పులిచింత జాతికి చెందిన మొక్కలు నాటారు. వీటి కోసం 5 నీటి గుంతలను ఏర్పాటు చేశారు. ఒక చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. అటవీ ప్రాంతం చుట్టూ మనుషులు ప్రవేశించకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. వేసవిలో రక్షించుకునేందుకు బోర్లు వేసి నీరు ఇవ్వడంతోపాటు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. నీటి గుంతల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి చెట్లు బతికేలా చేశారు. అధికారుల శ్రమ ఫలితంగా నేడు దేశాయిపేట అటవీ ప్రాంతంలో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. జీవరాశుల ఉనికి ఇక్కడ ప్రారంభమైంది. దేశాయిపేట పరిధిలో చేసినట్లుగానే రాయికల్, ధర్మపురి రేంజ్ల్లోను అటవీ సంపదను వృద్ధి చేసే ప్రక్రియ ఆరంభమైంది.
చర్యలు.. ఫలితాలు
అటవీ సంపద వృద్ధితోపాటు అడవిని చిక్కబరిచేందుకు అధికారులు పలు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లాలోని అటవీ ప్రాంతంలో 38 చెక్‌డ్యామ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే వంద కుంటలను తవ్వించారు. కుంటలతోపాటు గుట్టలు ఉన్నప్రాంతాల్లో నీటి ధారల ఆధారంగా ట్రెంచ్‌లను రూపొందించారు. అలాగే 788 రాతికట్టడాలను నిర్మించారు. ఇంకా నీటి ధారల ఆధారంగా 3,29,265 మీటర్ల పొడవున సమతల కందకాలను తవ్వించారు. ఒక్క అటవీ ప్రాంతంలోనే 19.60లక్షల మొక్కలను నాటి వాటిని పెంచుతున్నారు. రక్షణ కోసం 17 కిలోమీటర్ల పొడవునా అటవీ ప్రాంతం చుట్టూ కందకాలు తవ్వించారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం 671 కిలోమీటర్ల పొడవునా ఫైర్లైన్లు, రెండు వాచ్ టవర్లను అమర్చారు. వీటితోపాటు వృక్షాలను నరికివేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అధికారుల చర్యలు, జాగ్రత్తల నేపథ్యంలో అటవీ సంపద తిరిగి గాడిన పడింది. 8377 ఎకరాల్లో తిరిగి అడవీ పునరుద్ధరించబడింది. 2,955 ఎకరాల్లో అటవీ అధికారులు ప్లాంటేషన్లను విజయవంతంగా ఏర్పాటు చేశారు. అధికారుల శ్రమ, కృషి వల్ల అడవులు చిగురిస్తుండడంతో అడవిలో ఉండే జీవరాశులు సైతం వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో రెండు చిరుతల సంచారం ప్రారంభమైంది. ఇవి కొడిమ్యాల రేంజ్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఎలుగుబంట్ల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. నక్కలు, అడవి గొర్రెలు, నీలువాయి, జింకల సంతతి గతం కంటే దాదాపు నలభై శాతం పెరిగింది. పక్షుల సంఖ్య సైతం వృద్ధిలోకి వచ్చింది.
బ్లాక్ ప్లాంటేషన్ : అడవి ప్రాంతంలో పూర్తిగా అడవి నశించిన చోట్ల ఈ బ్లాక్ ప్లాంటేషన్ పద్ధతిలో మొక్కలు పెంపకం ప్రారంభించారు. పంటల సాగు కోసం ఎలాగైతే దుక్కులు దున్ని వరినాట్లు వేసి సాగు చేస్తారో అదే పద్ధతిలో బ్లాక్‌ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
గ్యాప్ ప్లాంటేషన్ : అటవీ ప్రాంతం మైదానంలా మారిన చోట్ల ట్రాక్టర్లతో దున్ని మొక్కలు నాటి పెంచే ప్రక్రియను చేపట్టారు. చెట్లు పలుచగా ఉన్నట్లయితే అక్కడ గ్యాప్ ప్లాంటేషన్ పద్ధతిని పాటిస్తూ వృద్ధి చేసే ప్రక్రియను చేపట్టారు. అడవిలో ఎక్కడైతే చెట్ల పోయాయో ఆ ప్రాంతాల్లో గుంతలు తీసి మొక్కలు నాటి పెంచే ప్రక్రియను పాటిస్తూ తిరిగి అడవిని ఫుల్‌ఫిల్ చేసే పనికి శ్రీకారం చుట్టారు.
బాంబింగ్ ప్లాంటేషన్ : అడవిలో చాలా చోట్ల నాలాలు ఉన్నాయి. వీటికి ఇరువైపులా ఇసుక మేటలు వేసే అవకాశాలున్నాయి. అయితే ఈ నాలాలకు ఇరువైపులా ఉన్న ఇసుక ప్రాంతాల్లోనూ పచ్చదనాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ నాలా చుట్టూ ఉండే ఇసుక మేటల్లో వెదురుబొంగు మొక్కలను పెంచేందుకు అనువుగా ఉంటుందని గుర్తించి, నాలా చుట్టూ బాంబింగ్ పద్ధతిలో వెదురు వనాలను వృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.
మౌండ్ ప్లాంటింగ్ : అడవుల్లో ఈజీఎస్ కూలీలతో నిర్మించిన ట్రెంచ్ల్లోనూ మొక్కలు పెంచే పద్ధతి. అటవీ ప్రాంతంలో నీటి నిల్వల కోసం చిన్నచిన్న ట్రెంచ్‌లను ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రెంచ్‌లు తవ్వి పక్కనే పోసిన మట్టిలోనూ మొక్కలను పెంచే ప్రక్రియ మొదలు పెట్టారు. ట్రెంచ్‌లో వచ్చిన మట్టి కుప్పపైన ఐదేసి ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ట్రెంచ్ల్లో నీటిని తట్టుకొని బతికి పెరిగే రకానికి చెందిన తెల్లమద్ది లాంటి ఔషధ చెట్ల పెంపకం ప్రారంభించారు.
బోడిగుట్టల వనీకరణ : కొండల వాలుపైన సైతం వృక్షాలను పెంచే ప్రక్రియను బోడిగుట్టల వనీకరణగా పేర్కొంటున్నారు. కొండ వాలులో ట్రెంచ్‌లను (కందకం లాంటిది) తవ్వి, వాటికి ఎగువ, దిగువ భాగాల్లో అడవులను పెంచుతున్నారు. ఇక గుంతలు తీసి లేబర్ ఇన్సెంటివ్ పద్ధతిలోనూ కొంత ప్రయత్నం చేస్తున్నారు. రాయికల్ లాంటి దట్టమైన టేకు వనాలతో కూడిన అటవీ ప్రాంతంలో కల్చరల్ ఆపరేషన్స్‌ను నిర్వహిస్తూ అడవిని తిరిగి బలోపేతం చేస్తున్నారు.
అవగాహన పెరగాలి
ప్రతి మనిషికి అటవీ సంపద, పర్యావరణపై అవగాహన రావాల్సిన అవసరమున్నది. పూర్వకాలంలో మనిషి పర్యావరణాన్ని కాపాడాడు. దురదృష్టవశాత్తూ యాభై ఏండ్లుగా పర్యావరణంపై అవగాహన లోపించింది. దీంతో అటవీ సంపద హననమై, అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నది. జీవజాలం క్రమంగా సమస్యల్లోకి కూరుకుపోయింది. సీఎం కేసీఆర్ పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు, అటవీ సంపదను కాపాడడం, కనీసం 33 శాతం అడవులను పెంచడం అనేక ప్రక్రియను చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ సహకారం ఉండడంతో పలు పద్ధతుల్లో అడవులను రక్షించే పనిని చేపట్టాం. కొంత సక్సెస్ సాధించాం. అయితే మనిషికి పర్యావరణంపై, అడవి సంపదపై, జీవకోటి మనుగడపై అవగాహన రావాలి. అప్పుడే ప్రకృతి బాగుంటుంది. జీవకోటి చల్లగుంటుంది.
– బైరవరపు వెంకటేశ్వరరావు, జిల్లా అటవీశాఖ అధికారి (జగిత్యాల)