సమైక్య చీకట్లను చీల్చుకొని ఉదయించిన తెలంగాణలో కరీంనగర్ జిల్లా సంక్షేమంలో దూసుకెళ్తున్నది. సకల జనుల హితమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు బృహత్తర పథకాలకు అంకురార్పణ చేస్తుండగా, లక్షలాది మంది జీవితాలకు భరోసా దొరుకుతున్నది. ఆసహాయుల జీవితాలకు ఆసరాతో బాసటగా నిలుస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో సేద్యరంగంలోనే సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇక దశాబ్దాలుగా అణగారిన దళిత వర్గాలు సగర్వంగా తలెత్తుకునేలా ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న దళిత బంధుతో వందలాది మంది బతుకుల్లో వెలుగులు నిండగా, పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని హుజూరాబాద్‌ను ఎంపిక చేసి ఇక్కడ 18,021 లబ్ధిదారులకు రూ.9.90 లక్షల చొప్పున రూ.1,784.07 కోట్ల ఆర్థికసాయాన్ని అందజేసి విజయవంతంగా అమలు చేసింది. రైతు బంధు కింద సాగుకు పెట్టుబడి సాయం, ఇంటి పెద్ద పోతే 5లక్షల రైతు బీమాతో కర్షకుడికి భరోసా కలిగింది. కులవృత్తులకు జీవం పోసేందుకు లాండ్రీషాపులు, సెలూన్లకు 250 యూనిట్లు, దళిత, గిరిజన గృహాలకు 100 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఇంకా గొర్రెల పంపిణీతో గొల్లకుర్మల జీవితాల్లో మార్పులు తెచ్చింది. ఇలా ఒక్కటేమిటి స్వరాష్ట్రంలో సకల జనుల హితమే ధ్యేయంగా తీరొక్క స్కీంలతో జిల్లా దశ,దిశా పూర్తిగా మారిపోయింది.
– కరీంనగర్, మార్చి 16(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగు రేఖలుగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలతో అమలవుతున్న ఈ పథకాలతో ప్రతి సామాజిక వర్గానికి లబ్ధి జరుగుతోంది. అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న పథకాల్లో రైతుబంధు ఒకటి. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,654.77 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. రైతు బీమా కింద రూ.113 కోట్లు రైతు కుటుంబాలకు పరిహారంగా అందించారు. మరో చెప్పుకోదగిన పథకం దళితబంధు. ఈ పథకం కింద జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 18,021 లబ్ధిదారులైన ఒక్కో దళిత కుటుంబానికి రూ.9.90 లక్షల చొప్పున రూ.1,784.07 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతే కాకుండా జిల్లాలో ఆసరా పెన్షన్ల కిందనే ప్రతి నెలా రూ.30.39 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ప్రభుత్వం ఇదేనని లబ్ధిదారులు చెబుతున్నారు.
ఆసరా : 1,38,980 మందికి నెలనెలా 30.39కోట్లు
దళిత బంధు : 18,231మందికి 1804.86కోట్లు
రైతుబంధు : 1,93,330 మందికి 1,654.77 కోట్ల పెట్టుబడి
రైతు బీమా : 2,326ల కుటుంబాలకు 113.43 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ : 20,399 మందికి లబ్ధి
డబుల్ బెడ్రూం ఇండ్లు : 390.56 కోట్లతో 6,360 ఇండ్లు
గొర్రెల పంపిణీ : 17,105 మందికి 25.58 కోట్లు
కేసీఆర్ కిట్లు : 41,876 మందికి 7.53 కోట్లు
సబ్సిడీ కరెంట్ : 3910 మందికి 250 యూనిట్ల చొప్పున లబ్ధి
6,360 డబుల్ బెడ్రూం ఇండ్లు
జిల్లాలో రూ.390.56 కోట్లతో 6,360 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో చొప్పదండి నియోజకవర్గంలో 469 ఇండ్లు ప్రగతిలో ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో 497 ఇండ్లలో 243 పూర్తయ్యాయి. మిగతావి ప్రగతిలో ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన 3,104 ఇండ్లలో 264 పూర్తికాగా, 950 ప్రగతిలో ఉన్నాయి. కరీంనగర్ నియోజకవర్గంలో చేపట్టిన 1,400 ఇండ్లలో 207 పూర్తికాగా, 660 ఇండ్లు తుది దశకు చేరుకున్నాయి. వీటిలో ముగ్ధుంపూర్, కమాన్‌పూర్, ఎలగందుల, ఖాజీపూర్ గ్రామాల్లో నిర్మించిన ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక మానకొండూర్‌లో చేపట్టిన 890 ఇండ్లలో 75 పూర్తి కాగా, 92 ప్రగతిలో ఉన్నాయి.
నేతన్నకు బీమా
చేనేత, మరమగ్గాలు, వాటి అనుబంధంగా పనిచేసే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ కార్మికులు ఏ కారణంతోనైనా మరణించినట్లయితే ఆ కుటుంబాలు ఆర్థికంగా కుంగి పోకుండా ఉండేందుకు రైతుబీమా మాదిరిగానే రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారు. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 3,851 మందిని చేర్పించగా 9 మంది మరణించారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు.
రైతు కుటుంబాలకు ధీమా
ఏదేని కారణంతో రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వం రైతుబీమా ద్వారా కొండంత అండగా ఉంటోంది. వారి కుటుంబాలు రోడ్డున పడకుండా రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించింది. ఇందులో భాగంగా 2018-19లో 363 మంది చనిపోతే రూ.18.15 కోట్లు, 2019-20లో 472 మంది చనిపోతే 23.60 కోట్లు, 2020-21లో 734 మంది చనిపోతే 36.70 కోట్లు, 2021-22లో 476 మంది చనిపోతే రూ.23.65 కోట్లు, 2022-23లో ఇప్పటి వరకు 303 మంది చనిపోతే 281 మందికి రూ.10.90 కోట్లు అందించింది. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటి వరకు వివిధ కారణాలతో 2,326 మంది రైతులు మరణించగా రూ.113 కోట్ల సాయాన్ని అందించింది.
రూ.1,654.77 కోట్ల రైతుబంధు
రైతుబంధు పథకం ద్వారా 2018 వానకాంలో 1,45,245 మందికి రూ.124.58 కోట్లు, 2018-19 యాసంగిలో 1,48,759 మందికి రూ.130.56 కోట్లు, 2019 వానకాలంలో 1,61,653 మందికి రూ.171.65 కోట్లు, 2019-20 యాసంగిలో 1,48,264 మందికి రూ.155.16 కోట్లు, 2020 వానకాలంలో 1,72,877 మంది రైతులకు రూ.177.09 కోట్లు, 2020-21 యాసంగిలో 1,76,138 మందికి రూ.178.34 కోట్లు, 2021 వానకాలంలో 1,80,878 మందికి రూ.179.51 కోట్లు, 2021-22 యాసంగిలో 1,86,052 మందికి రూ.180.44 కోట్లు, 2022 వానకాలంలో 1,93,330 మందికి రూ.181.89 కోట్లు, 2022-23 యాసంగిలో 1,80,215 మందికి రూ.175.55 కోట్లు రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు జమ చేశారు.
దళిత బంధు పథకం
రాష్ట్రంలోనే తొలిసారి దళితబంధు పథకాన్ని జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం ద్వారా ఇల్లందకుంటలో 2,116, హుజూరాబాద్‌లో 2,720, హుజూరాబాద్ మున్సిపల్లో 1,623, జమ్మికుంటలో 2,358, జమ్మికుంట మున్సిపల్లో 2,254, వీణవంకలో 3,009, కమలాపూర్‌లో 3,941 మంది లబ్ధిదారులకు రూ.1,784.07 కోట్లు ఖర్చు చేసి నిరుపేదలైన దళిత కుటుంబాలకు రూ.9.90 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది. వీటితో వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గంలోని దళితులు ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. అలాగే జిల్లాలోని మిగతా నియోజకవర్గాలైన కరీంనగర్లో 100, మానకొండూర్‌లో 61, చొప్పదండిలో 49 మంది దళితులకు ఈ పథకం కింద ఆర్థికసాయాన్ని అందించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్
ఈ పథకాల ద్వారా 2017-18లో 2,417 మందికి, 2018-19లో 2,844 మందికి, 2019-20లో 3,605 మందికి, 2020-21లో 3,871 మందికి, 2021-22లో 4,495 మందికి, 2022-23లో 3,167 మందికి వివిధ నియోజకవర్గాల్లో జరిగిన పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు ఆర్థిక సాయం అందించింది. పథకం ప్రవేశ పెట్టిన మొదట్లో రూ.50 వేలు, ఆ తర్వాత రూ.75 వేలు, ఇప్పుడు రూ.1,00,116ల ఆర్థికసాయం చేస్తున్నది. ఈ పథకం ఎందరో పేదింటి ఆడపిల్లలకు ఆశాదీపంగా మారింది.
ఆసరా పెన్షన్లు
జిల్లాలో 1,38,980 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. ఇందులో 57,061 మందికి వృద్ధాప్య, 38,215 మందికి వితంతు, 23,793 మందికి దివ్యాంగులు, 2,878 మందికి నేత కార్మికులు, 3,953 మందికి గీత కార్మికులు, 9,591 మందికి బీడీ కార్మికులు, 3,489 మంది ఒంటరి మహిళల కేటగిరీలో పెన్షన్లు అందిస్తున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016 చొప్పున రూ.7.17 కోట్లు, మిగతా కేటగిరీల్లోని వారికి రూ. 23.22 కోట్ల చొప్పున మొత్తం రూ.30.39 కోట్లు ప్రతి నెలా అందిస్తున్నారు.
గొర్రెల పంపిణీ
జిల్లాలో గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రూ.1.25 లక్షల యూనిట్ విలువతో ఒక మగ, 20 ఆడ గొర్రెలు అందిస్తున్నది. లబ్ధిదారులు తమ వాటాగా ఒక్కో యూనిట్‌కు రూ.31,250లు డీడీల రూపంలో చెల్లించారు. ఈ పథకానికి జిల్లాలో 29,813 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఏ జాబితా కింద ఇప్పటికే రూ.21.10 కోట్లు వెచ్చించి 13,519 మందికి పంపిణీ చేశారు. బీ జాబితాలో పంపిణీ చేయాల్సిన 13,439 మందిలో ఇప్పటి వరకు రూ.4.48 కోట్లు వెచ్చించి 3,586 యూనిట్లను మంజూరు చేశారు.
41,876 కేసీఆర్ కిట్లు
ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీని కింద ఇప్పటి వరకు 41,876 కిట్లను పంపిణీ చేశారు. ఒక్కో కిట్ విలువ రూ.1,800 ఉంటుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.7.53 కోట్ల్లు ఖర్చు చేసింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకున్న వారికి ఈ కిట్స్ అందిస్తున్నారు. ఇందులో చీరెలు, దోమ తెర, సబ్బులు, గజ్జె, పౌడర్ వంటి 16 రకాల వస్తువులు అందిస్తున్నారు. అలాగే, ప్రభుత్వ దవాఖానల్లో జరిగిన ప్రసవాల్లో ఆడి శిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు అందిస్తున్నారు. ఈ పథకాలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్క కరీంనగర్ ఎంసీహెచ్‌లో రోజుకు 25 -30 ప్రసవాలు జరుగుతున్నాయంటే కేసీఆర్ కిట్లే కారణంగా చెప్పవచ్చు.
చేతి వృత్తులకూ సబ్సిడీ కరెంట్
చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న అట్టడుగు వర్గాలైన నాయీబ్రాహ్మణులు, రజకులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విద్యుత్తును అందిస్తోంది. 2021 నుంచి అమలవుతున్న ఈ పథకం ద్వారా జిల్లాలోని 1,245 సెలూన్ షాపులు నిర్వహిస్తున్న నాయీబ్రాహ్మణులు, 2,665 లాండ్రీ, డ్రైక్లీనింగ్ షాపులు నిర్వహించుకుంటున్న రజకులకు లబ్ధి చేకూరుతోంది. గతంలో ఈ వర్గాలకు ఒక్కో షాపునకు నెలకు రూ.1,500 నుంచి రూ.2వేల వరకు కరెంట్ బిల్లులు వచ్చేవి. ఇప్పుడు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నారు. 250 యూనిట్లు దాటితేనే వీళ్లకు బిల్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది నాయీబ్రాహ్మణులు, రజకులు తమకు ఉన్న అవకాశం మేరకే విద్యుత్ కాల్చుకుంటూ తమ దుకాణాలను నిర్వహించుకుంటున్నారు.
కేసీఆర్ కిట్ మంచి పథకం
కేసీఆర్ కిట్ పథకం చానా బాగుంది. ఇందులో తల్లితోపాటు శిశువుకు ఉపయోగపడే చానా వస్తువులు ఉన్నాయి. పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకం పెట్టింది. దీని కింద ఇచ్చే కిట్లనే కాకుండా ప్రభుత్వ దవాఖాన్ల డెలివరీ అయితే మా అసోంటి పేదోళ్లకు మంచి మేలు జరుగుతున్నది. నేను ఇదే కాన్పు కోసం ప్రైవేట్ దవాఖాన్ల పరీక్షలు చేయించుకున్న. రూ.50 వేలదాక అయినయ్. ప్రభుత్వ దవాఖాన మీద నమ్మకంతోని ఈడికి వచ్చిన. ఒక్క రూపాయి తీస్కోకుంట డెలివరీ చేసిండ్రు. బయట రూ.లక్ష దాటేది. ఇంత మంచిగ చూసుకుంటున్న సీఎం కేసీఆర్ సార్‌కు ధన్యవాదాలు.
– సండ్ర రమ్య, లలితాపూర్ (మానకొండూర్)
మొదటి కాన్పు రూ.లక్ష ఖర్చయింది
మొదటి కాన్పు ప్రైవేట్ దవాఖాన్ల చేయించుకుంటే రూ.లక్ష ఖర్చచ్చింది. ఇదని, అదని లేని భయాలు చెప్పిండ్రు. కేసీఆర్ కిట్ పెట్టినంక చానా మంది ప్రభుత్వ దవాఖాన్ల డెలివరీ చేయించుకుంటున్నరు. ఒక్క రూపాయి ఖర్చు లేకుంట సాధారణ కాన్పులు చేస్తున్నరు. అవసరమైనోళ్లకు ఆపరేషన్లు చేస్తున్నరు. దవాఖాన్లను ప్రభుత్వం మంచిగ తయారు చేసింది. బాగా ఉన్నోళ్లు సుతం ఇక్కడికే వచ్చి డెలివరీలు చేయించుకుంటున్నరు. ఇక్కడ కాన్పు చేసుకున్నొళ్లకు కేసీఆర్ కిట్ ఇస్తున్నరు. కిట్తోని వచ్చే వస్తువులన్నీ విలువైనవి. పేదోళ్లు ఇసోంటి వస్తువులు కొనలేరు. ఇలాంటి సహాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు థాంక్యూ.
– మాడబోయిన మౌనిక, కరీంనగర్
పెట్టుబడికి గోసతప్పింది
నాకు ఆరెకరాల భూమి ఉంది. ఒకప్పుడు సీజన్ అత్తుందంటే శానా భయమయ్యేది. పెట్టుబడికి పైసలెట్ల అని దిగులయ్యేది. చేతిల పైసల్లేక అప్పులు తెచ్చేది. మల్లా అచ్చిన పంటను అమ్మి అసలు, అడ్డి కట్టేది. ఇట్ల ఏండ్ల సంది ఎల్లదీసినం. కానీ, తెలంగాణ సర్కారు వచ్చినంక అప్పుల తిప్పలు తప్పినయ్.. వానకాలం, ఏసంగి పంటల సాగుకు ముందే రైతు బంధు బ్యాంక్ ఖాతల పడుతున్నయ్.. మాకు ఏడాదికి రూ.60 వేలు ఖాతాల జమవుతయ్. వీటితోనే పెట్టుబడి ఎల్లదీస్తున్న. ట్రాక్టర్ దున్నుడు, కూలీలు, ఎరువులకు ఖర్చు చేస్తున్న. మా పైసలతోమేమే చేసుకుంటున్నం. పెట్టుబడి కోసం వేరేటోళ్లను చేయిచాచి అప్పడగకుండా చేసిన కేసీఆర్ సారు సల్లంగుండాలె.
– ఉసికెమల్ల కొమురయ్య, చొప్పదండి
వీడియో మిక్సింగ్ షాప్ పెట్టుకున్నం
దళిత బంధు పథకం ద్వారా వచ్చిన రూ.10 లక్షలతో వీడియో మిక్సింగ్ షాప్ పెట్టుకున్నం. ఇందులో రెండు కంప్యూటర్లు కొనుక్కొని, వీడియో మిక్సింగ్‌కు సంబంధించిన విలువైన సాఫ్ట్వేర్లను కొనుగోలు చేసినం. రోజుకు ఒకటి.. రెండు వీడియోల మిక్సింగ్ పూర్తి చేసి కస్టమర్లకు అందజేస్తున్నం. ఒక వీడియో మిక్సింగ్‌కు రూ.రెండు వేల నుంచి రూ.2500 వరకు తీసుకుంటున్నం. ప్రతి రోజూ రూ.2000 నుంచి రూ.5000 వరకు సంపాదించగలుగుతున్నం. షాపులో నేను, నా భర్త (ప్రమోద్) ఇద్దరమే కష్టపడుతూ పని చేసుకుంట కుటుంబాన్ని చకగా పోషించుకుంటున్నం. దుకాణం కిరాయి నెలకు రూ.4000 చెల్లిస్తూ మిగిలిన డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చకగా చదివించుకుని ఉన్నతంగా తీర్చిదిద్దగలుగుతున్నం. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే మాలాంటి నిరుపేదలకు దళితబంధు వచ్చింది. దాని ద్వారా మా బతుకుల వెలుగులు నిండినయ్. మాలాంటి వారిని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేర్చిన కేసీఆర్‌కు మేం జీవితాంతం రుణపడి ఉంటం. ఆయన పీఎం అయితే దేశవ్యాప్తంగా దళితుల బతుకులు మార్చుతారన్న నమ్మకం ఉంది.
– పాకాల నాగమణి, దళితబంధు యూనిట్ లబ్ధిదారు, (హుజూరాబాద్‌టౌన్)