Right to Education Act | కోరుట్ల, జూన్ 17: జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తిరుపతి నాయక్ అన్నారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలు జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల లోపు వయస్సు పేద పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాల్సి ఉందన్నారు. కానీ ఈ విషయాన్ని విద్యాసంస్థల యజమానులు పట్టించుకోవడం లేదన్నారు.
విద్యాసంస్థల నిర్వాహకులు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేసిన అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఫీజులు విపరీతంగా పెంచి, విద్యార్థుల తల్లి తండ్రులపై మోయలేని భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాధికారి తక్షణమే స్పందించి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్, షూస్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
విద్యార్థుల తల్లి తండ్రులపై భారం పడకుండా అధికారులు తగు నియంత్రణ చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి యెల్ల పోశయ్య, నాయకులు శంకర్, అశోక్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.