Putta Madhu | కమాన్ పూర్, సెప్టెంబర్ 17: మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి పుట్ట మధుకు ప్రాణహాని ముప్పు పొంచి ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటిపై కాంగ్రెస్ నాయకుల ముట్టడిని నిరసిస్తూ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కు ప్రాణహాని పొంచివుందని ఆయనకు ఏమైనా జరిగితే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, మంథని ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వెంట చీమల దండులాంటి బీఆర్ఎస్ సైన్యం ఉందని, పుట్ట మధు పై అభిమానంతో ఓట్లేసిన 72 వేలకు మందికి పైగా ఓటర్లు వెన్నంటి ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తేరుగాలని సూచించారు. పుట్ట మధు కోసం ప్రాణ త్యాగాలకు సైతం తామంతా సంసిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు.
కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్ లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్, ఏఐఏవైఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కిష్టయ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 15న రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కలిసి ప్రారంభించారన్నారు. అంతకు ముందు రాత్రి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి ఉన్న ముసుగును తొలగించి దండలు వేసి అనైతిక చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పెంచికల్ పేట్ లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అధికార పార్టీ నాయకులు అడుగడుగున అవంతరాలు సృష్టిస్తూ పోలీసులు ఆంక్షలతో ఇబ్బందులు సృష్టించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహానీయుల విగ్రహాల ఏర్పాటుకు ఆంక్షలు.. 144 సెక్షన్లు పెట్టే ఆలోచన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇచ్చిన ఆరు గ్యారింటీలు 420 హామీలు అమలు చేయకుండా, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేసి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడమేనా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడైనా పుట్ట మధు ఇంటిని ముట్టడించడంలాంటి చర్యకు పూనుకోవడం అధికార పార్టీ ఆహాంభావానికి నిలువెత్తు నిదర్శమని, అధికార కాంగ్రెస్ పార్టీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సంసిద్ధమవుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ శంకర్, మహిళ విభాగం అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, నాయకులు రాచకొండ రవి, ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, కొట్టె భూమయ్య, గుర్రం లక్ష్మీమల్లు, ఆకుల గట్టయ్య, కొండ వెంకటేష్, పోలుదాసరి సాయి కుమార్, జాబు సతీష్, చిందం తిరుపతి, ఆడెపు శ్రీనివాస్, పల్లె నారాయణ, పెండ్లి నారాయణ, తోట రాజ్ కుమార్, తోడేటి రాజీర్, అనవేన దేవేందర్, ఆకుల రమేష్, కుందారపు సత్యనారాయణ, జాబు శ్రీనివాస్, ముకీద్, గాజుల సతీష్, బోయిని బాలకృష్ణ, గాదె సదయ్య, ఎలాబోయిన రామ్మూర్తిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.