Telangana Activists | కరీంనగర్ కలెక్టరేట్, మే 30 : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకిచ్చిన హామీలు అమలు చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లాశాఖ డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం జేఏసీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎలుగు కవిత ఆధ్వర్యంలో పలువురు ఉద్యమకారులు ఆర్డీవో మహేశ్వర్ ను కలిసి హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలైన ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఉచిత ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వటం, ఉద్యమకారులకు సమరయోధులుగా గుర్తించి, ప్రతి నెల రూ.30వేల గౌరవ వేతనం మంజూరు, ఒక్కో ఉద్యమకారునికి రూ.20లక్షల ప్రమాద బీమా సౌకర్యం, అమరవీరుల పేర స్మృతి వనం ఏర్పాటు, ప్రభుత్వ పథకాల మంజూరీలో మొదటి ప్రాధాన్యత, నామినేటెడ్ పోస్టుల్లో ఉద్యమకారులను నియమించడం, తదితర హామీల అమలుకు వెంటనే కార్యచరణ ప్రారంభించాలన్నారు.
లేనిపక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం సూపరెంటెండెంట్ కు వినతిపత్రం అందజేశారు.