Kourutla | కోరుట్ల, ఏప్రిల్ 4: ఆర్టీసీ సంస్థల్లో దశాబ్దాల కాలం సంస్థ అభివృద్ధి కోసం పనిచేసి వయస్సు పరిమితుల రీత్యా సంస్థ నుంచి ఉద్యోగం విరమణ చేసి జీవనం సాగిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తిరుపతి నాయక్ డిమాండ్ చేశారు.
పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం ఎస్ఈబ్ల్యూఎఫ్, సీఐటీయూ పిలుపు మేరకు సమస్యలు పరిష్కరించాలని నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసిన కాలంలో చాలీచాలని జీతంతో కూడా సంస్థ అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్స్ స్కీం ఇవ్వడం లేదని, కేవలం పీఎఫ్ అంతర్భాగంగా ఉన్న ఈపీఎఫ్ స్కీం ద్వారా పొందే నామమాత్రపు పెన్షన్స్ మాత్రమే పొందుతున్నారని చెప్పారు.
ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు రావాల్సిన టెర్మినల్ సెలవులు, ఇతర బెనిఫిట్స్ రిటైర్ అయిన సెలవు లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ ఉద్యోగి స్పాంజ్కు ఉమ్మడిగా రూ.20 లక్షలు ఇవ్వాలన్నారు. కనీస పెన్షన్స్ స్కీం రూ. 9 వేలుగా నిర్ణయించాలన్నారు. చట్టబద్దంగా ఇవ్వాల్సిన అన్ని పెన్షన్ బెన్ఫిట్స్ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తిరుపతి నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసయ్య, కుంచం శంకర్, కొమ్ము హరీష్, తదితరులు పాల్గొన్నారు.