జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో కల్లోలం రేగుతున్నదా..? ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకూ తారాస్థాయికి చేరుతున్నదా..? ‘నువ్వా.. నేనా’ అనే రీతిలో మొదలైన అంతర్యుద్ధం ఇటీవలి కాలంలో పరాకాష్టకు చేరిందా..? వీరిద్దరి మధ్య పోరులో పేద, మధ్య తరగతి ప్రజలు బలికావాల్సి వస్తున్నదా..? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. నూకపల్లిలో అసంపూర్తిగా ఉన్న పాత ఇందిరమ్మ ఇండ్లను 5లక్షల స్కీంలో చేర్చి పూర్తి చేసేందుకు ఓ వైపు ప్రయత్నాలు జరుగుతుండగానే, మరోవైపు అక్కడ బస్టాండ్, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, హాస్పిటల్ కడతామంటూ కూల్చివేయడం అగ్గిరాజేసింది. ఫలితంగా సామాన్యులు సమిధలవుతుండగా, ఉద్యోగ, అధికార యంత్రాంగం సైతం నలిగిపోతున్నట్లు తెలుస్తున్నది.
జగిత్యాల, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. ఈ వర్గపోరులో ఇందిరమ్మ లబ్ధిదారులు సమిధలు కావాల్సి వస్తున్నది. నూకపెల్లి ఇందిరమ్మ ఇండ్ల కూల్చివేత వివాదాస్పదం కాగా, పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. 2008లో టీ జీవన్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం మల్యాల మండలం నూకపెల్లిలో 200 ఎకరాల భూమిని సేకరించి, జగిత్యాలకు చెందిన దాదాపు 4వేల మంది పేదలకు ఇందిరమ్మ పథకం కింద ఇండ్ల స్థలాలను ఇచ్చింది. ఒక్కొక్కరికి 70 గజాల చొప్పున ఇండ్ల పట్టాలు మంజూరు చేసింది. ఇండ్ల నిర్మాణాలకు అవకాశం కల్పించింది. ఐదారువందల మంది ఇండ్లు నిర్మించుకొని అందులో నివాసమున్నారు.
దాదాపు 2800 మంది ఇండ్ల నిర్మాణాలను చేపట్టి, వివిధ స్థాయిల్లో నిలిపివేశారు. కొంత మంది నిర్మాణలే మొదలు పెట్టలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత 2017లో అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాల పట్టణానికి స్పెషల్ కోటా కింద 4,500 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయించారు. ఈ ఇండ్ల నిర్మాణానికి స్థలాన్ని సేకరించే విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో అప్పటి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, నూకపెల్లి ఇందిరమ్మ కాలనీలోనే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలని సూచించారు. ఆ సమయంలో ఇండ్ల నిర్మాణాలు, స్థలాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
దాంతో అప్పటికే వివిధ దశల వరకు నిర్మించి ఉన్న 1500 ఇండ్లను కూల్చివేయడంతోపాటు ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకొని నిర్మాణం ప్రారంభించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పూర్తయిన తర్వాత 2023లో కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేశారు. కానీ, ఇందిరమ్మ స్థలాలను, వివిధ స్థాయిలో ఉన్న నిర్మాణాలను కోల్పోయిన వారికి కేటాయించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత లబ్ధిదారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గీయుల మధ్య వివాదం రాజుకోగా, వీరి ఆధిపత్య పోరులో సామాన్యులు బలికావాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా నూకపెల్లి వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లు వివాదానికి కారణం కాగా, లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నూకపెల్లిలో వివిధ స్థాయిల్లో నిర్మించి నిలిచిపోయిన ఇండ్లు 1,611 ఉన్నాయని, వాటిని 5లక్షల ఇందిరమ్మ ఇండ్ల పథకం పరిధిలోకి తెచ్చి, నిర్మాణం పూర్తి చేయించాలని వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి దానిని కలెక్టర్‌కు పంపించి ఎంత వ్యయం అవుతుందో అంచనాలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. కలెక్టర్ 52 కోట్ల వ్యయమవుతుందని అంచనాలు రూపొందించి సీఎంకు నివేదించారు.
ఈ క్రమంలోనే గత ఆదివారం మున్సిపల్ అధికారులు అర్ధారంతరంగా కొన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కూల్చివేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, చెప్పకుండానే కూల్చివేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కూల్చివేశారని అధికారులను అడిగితే.. కూల్చివేసిన చోట బస్టాండ్, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, హాస్పిటల్ కడుతామని చెప్పి దాటవేశారు. కూల్చివేతలపై మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని డిమాండ్ చేయగా, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కూల్చివేతలు కేవలం అభివృద్ధి కోసం చేపట్టామని, రాజకీయం చేయవద్దంటూ ప్రకటనలు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇండ్లు కడితే డబుల్ బెడ్రూం ఇండ్లు వెలవెలబోతాయని, సొంత స్థలంలో ఇల్లున్న వాళ్ల పరిస్థితి మెరుగ్గా కనిపిస్తుందని, మాజీమంత్రికి పేరు వస్తుందన్న అక్కసుతో ఎమ్మెల్యే నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారని జీవన్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చి అది పట్టణంగా మారితే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు పేరు వస్తుందన్న అక్కసుతో మాజీమంత్రి వర్గీయులు అనవసరంగా యాగీ చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు విమర్శిస్తున్నారు.
నేతల మధ్య వర్గపోరు సామాన్యులకు, ముఖ్యంగా పేదలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతున్నది. ఎమ్మెల్యే వద్దకు వెళితే మాజీమంత్రికి కోపం వస్తుందని, మాజీమంత్రి వద్దకు వెళితే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సామాన్యులు వాపోతున్నారు. సంక్షేమం, అభివృద్ధి పనుల కోసం ఎవరి వద్దకు వెళ్లాలో అర్థం కావడం లేదంటున్నారు. ఒకరి వర్గానికి చెందిన వారీగా గుర్తిస్తే వారిపై కక్షపూరిత దాడులు వివిధ రూపాల్లో ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. చివరకు కుల సంఘాలకు సంబంధించిన కార్యవర్గాలు సైతం ఎవరిని ముందు కలువాలో తెలియక అవస్థల పాలవుతున్నామంటున్నారు. నియోజకవర్గంలోని చాలా మంది సామాన్యులు, నిరుపేదలు రాజకీయ నాయకుల వర్గపోరుకు బలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ ఇదే జరిగిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఆధిపత్య పోరులో తాము కూడా నలిగిపోతున్నామని కొందరు అధికారులు ఆవేదన చెందుతున్నారు. పట్ట్టుమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం అన్నట్టుగా తమ పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇందిరమ్మ కమిటీల నుంచి మొదలు కొని ఏ ఒక్క కమిటీ సక్రమంగా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. ఇక ఇండ్ల కూల్చివేతతో పాటు ఒక టేలా తొలగింపు విషయంలోనూ ఒక నాయకుడి ఒత్తిడి వల్ల అధికారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఇండ్ల కూల్చివేత విషయంలో ఎక్కడ ఉద్రిక్తత ఏర్పడుతుందోనని, జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఒక రోజు జిల్లా కేంద్రంలో లేకుండా హైదరాబాద్‌కు ఒక పనిమీద వెళ్లినట్టు తెలుస్తున్నది.
సార్ నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు బిడ్డలు. మేదరి పనిచేసుకొని బతుకుతున్న. నాకు ఉండడానికి ఇల్లు లేదు. కట్టుకుందామంటే జాగ లేదు. 2008లో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న. నాకు నూకపెల్లి దగ్గర 70 గజాల జాగ ఇచ్చిండ్రు. డి/103 పేరిట పట్టాకాయితం ఇచ్చారు. ఇల్లు కట్టుకోమ్మని చెప్పిన్రు. పిల్లలు పెండ్లిళ్లకు ఉన్నరు. వారికి లగ్గం చేసుడే తిప్పలైంది. కొడుకులకు సైతం పెద్దగా సంపాదన లేదు. అయినా ఇచ్చిన జాగలో బేస్మెంట్ కట్టుకున్న. అప్పటి సర్కారు 7వేలు ఇచ్చింది. 33వేల రుణం ఇచ్చింది. నాదగ్గర ఉన్న పైసలు కొన్ని కలిపి లెంటల్ లెవల్ వరకు ఇల్లు పూర్తిచేసి. ఇల్లు చెత్తుపోసేందుకు రాజారానికి చెందిన ఒక కాంట్రాక్టర్‌కు 50 వేలకు గుత్తకు ఇస్తే, డబ్బులు ఎత్తుకొని పారిపోయిండు. నాకు పైసలు ఎల్లలే. ఇళ్లు ఆగిపోయింది.
ఇంతట్లకే నా పెద్ద కొడుకు సచ్చిపోయిండు. వానికి ఇద్దరు పిల్లలు వాళ్లను చూసునేందుకు, పెంచేందుకే సరిపోతంది. పైసలు ఏమన్న జమైతే ఇల్లు పూర్తి చేయాలని అనుకున్న. రెండుమూడు నెలల కింద జీవన్‌రెడ్డి సార్‌ను కలిసిన. ఇళ్ల సంగతి సార్ అంటే.. ముఖ్యమంత్రికి లెటర్ రాసిన. ఐదులక్షల ఇచ్చే స్కీమ్‌ల పెడుతున్నం. పైసలు వస్తయి. నీ ఇల్లు పూర్తయితదని చెప్పిండు. సార్ చెప్పిండు కదా అని సంబురపడ్డ. ఇంతట్లకే లెంటల్ లెవల్ వరకు కట్టుకున్న నా ఇంటిని మున్సిపల్ సార్లు కూలగొట్టిన్రు. ఎందుకు సార్ కూలగొట్టిన్రు అంటే.. నీ ఇంటి అడుగున దవాఖాన కడుతం. బడి కడుతం. అందుకే కూలగొట్టినమని చెబుతున్రు. నా రెక్కల కష్టం మొత్తం ముంచిన్రు. నాకు ఇచ్చిన డబ్బు గజాల జాగ గుడ గుంజుకుంటరట. ఇదెక్కడి న్యాయం సారు.
– వేముల శశిక ( లబ్ధిదారు)
మాది గరీబు కుటుంబం. నా భర్త పేరు నసీరొద్దీన్. కూలీపని చేస్కొని బతుకుతున్నం. మాకు సొంతిల్లు లేదు. 2008లో నూకపెల్లి దగ్గర ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు 70 గజాల భూమిని ఇచ్చిన్రు. ఖుషీ అయినం. ఇల్లు కట్టుకొనుడు మొ దలు వెట్టినం. ఇద్దరు పిల్లల చదువుల కోసం పైసలు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. అయినా వీలైనంత వరకు ఇల్లు కట్టుకుంటూ వచ్చినం. అప్పటి సర్కార్ 67 వేల లోన్ ఇచ్చింది. 10 సిమెంట్ బస్తాలు ఇచ్చింది.
నీళ్లు లేక బిందెలతోటి మోసుకొని గోడలకు నీళ్లు పట్టిన. చెత్తు పోసుకున్నం. మెట్లు కట్టుకున్నం. దాదాపు ఇల్లు పూర్తయింది. ముందట రేకులు వేసుకుంటే దొంగలు ఎత్తుకుపోయిన్రు. ఇల్లు పూర్తయినా ప్లాస్టింగ్ కాకపోవడంతో మేం అందులోకి రాలే. కొద్ది రోజుల్లోనే ఆ పని కూడా పూర్తి చేసుకొని రావాలని అనుకున్నం. కానీ, ఘోరం చేసిన్రు. మా ఇంటిని కూల్చివేసిన్రు. ఇదెక్కడి అన్యాయం? నా ఇంటిని ఎందుకు కూలగొట్టిన్రు అంటే. బడి కడుతం. గుడికడుతం అంటున్నరు. ఇల్లు కూలగొట్టి బడికట్టుడు ఏంది? ఇదంతా మోసం.
– సలీమా, లబ్ధిదారురాలు