Korukanti Chander | యైటింక్లయిన్ కాలనీ, జనవరి 2 : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని రామగుండం మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరు కంటి చందర్ పిలుపునిచ్చారు. స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో కార్యకర్తలతో శుక్రవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తొలి సీఎం కేసీఆర్ పట్టుబట్టి కారుణ్య నియామకం ద్వారా మళ్లీ అమలు చేయించి సింగరేణి సంస్థకు పురుడు పోశాడని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు.
అమలు కానీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి విధ్వంసపాలనతో రెండేళ్లు గడిపిందని, ఈ రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పకడ్బందీగా అమలు చేయలేదని పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ కు త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన ఓట్లను చీల్చేందుకు అధికారం అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు కార్యకర్తలు బాధ్యత తీసుకొని ప్రజల్లోకి వెళ్లి వివరించాలని సూచించారు. ఈనెల 10వ తేదీన మరొకసారి సమావేశమై ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ముందుకు వెళ్లే విధానాలపై కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ రెండేళ్లుగా సాగుతున్న విధ్వంస పాలనకు చరమగీతం పాడాలన్నారు. అధికార బలం, ధన బలంతో ఓట్లను కొనేందుకు ప్రయత్నాలు చేస్తారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఈ విషయంలో కార్యకర్తలు సైనికుల పనిచేసి రామగుండం కార్పొరేషన్ లో గులాబీ జెండా ఎగిరేల కష్టపడి పనిచేయాలన్నారు. రామగుండంలో ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు.
వారి వైఫల్యాలే మన విజయానికి బాట వేస్తాయని భరోసాగా చెప్పారు. పట్టణ అధ్యక్షుడు మేడి సదానందం అధ్యక్షత న జరిగిన సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మందల కిషన్ రెడ్డి, కొండ్ర స్టాలిన్ గౌడ్, బాదే అంజలి దేవి, నాయకులు పులి రాకేష్, గూడెల్లి రామచందర్, ముత్యాల గౌడ్, కుమార్ నాయక్, ముక్కెర మొగిలి, దాసరి రాజమౌళి, బాలరాజు, సుజాత, స్వరూప, రోజా, రవి తదితరులు పాల్గొన్నారు.