కలెక్టరేట్, సెప్టెంబర్ 01:“పెన్షన్ భిక్ష కాదు.. అది మా హక్కు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీపీఎస్, కేంద్రం కొత్తగా తేనున్న ఏకీకృత పెన్షన్ విధానం మాకొద్దు. పాత పెన్షన్ విధానమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలుపుకోవాలి” అని వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు రోడ్డెక్కారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళా ఉద్యోగులు సైతం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదిస్తూ కదం తొక్కారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమలు ప్రారంభమైన సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించే ‘పెన్షన్ విద్రోహ దినం’ సందర్భంగా ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసనకు ముఖ్యఅతిథిగా జేఏసీ జిల్లా శాఖ చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు కూడా పాలకులు పాటించకపోవడం శోచనీయమన్నారు.
దేశంలోని అనేక రాష్ర్టాల్లో అమలు చేస్తున్న పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తెలంగాణలోనూ పునరుద్ధ్దరించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పొందుపర్చిందని గుర్తుచేశారు. సీపీఎస్‌పై ఉద్యోగులంతా దుమ్మెత్తిపోస్తుండగా, యూనిఫైడ్ పెన్షన్ స్కీం అంటూ మరో కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. పెన్షన్ లేని రంగాలకు ప్రతిభ కలిగిన ఉద్యోగులు రావడం లేదని, మెరుగైన వనరులు కూడా లేవన్నారు.
దీంతో ప్రభుత్వోద్యోగాల వైపు మేధావులు ఆలోచించడం లేదన్నారు. యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, ప్రభుత్వాలపై నమ్మకం కల్పించాలన్నారు. ఈ నిరసనలో టీఎన్జీవోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌రావు, టీజీవో నాయకులు కాళీచరణ్, విష్ణువర్ధన్, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పీ కేశవరెడ్డి, కార్యదర్శి లింగయ్య, ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు పర్రె రాజేశం, కేంద్ర సంఘం నాయకులు నాగుల నర్సింహస్వామి, రాగి శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజిరెడ్డి, రవీంద్రచారి, దామెర మహేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, విజయేందర్‌రెడ్డి, వెంకన్న, విద్యాసాగర్, నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి, ఇతర నాయకులు పాల్గొన్నారు.