Drinking water supply | సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 22 : ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన మాటను ఓ గ్రామ నూతన సర్పంచ్ నిలబెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే గ్రామంలోని తాగునీటి సమస్యను తీర్చారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచిరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి సతీమణి ఉప్పు లక్ష్మి సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం మానేరు వాగు నుంచి మంచరామి గ్రామం వరకు తన సొంత ఖర్చులతో దాదాపుగా రూ.40 వేలతో పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరా చేయించారు.
గతంలో కూడా గ్రామస్తులు అవసరాల కోసం అప్పుడు కూడా సొంత ఖర్చులతో పైపులైన్ వేయించారు. కొంతకాలం తాగునీటి సరఫరా జరిగింది. వరద రావడంతో పైపులైన్ దెబ్బతిని తాగునీటి సమస్య ఏర్పడింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందే పరిష్కరించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే గ్రామపంచాయతీ కార్యాలయానికి తన సొంత ఖర్చులతో కలర్స్ వేయించి, అందంగా ముస్తాబు చేయించారు. మంచిరామి నుంచి కనుకుల వరకు రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన పిచ్చి చెట్లను జేసీబీ సాయంతో తొలగించి రోడ్లు వెడల్పు చేయించారు.