AITUC | కోరుట్ల, జూలై 8: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను ప్రజలు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులతో కలసి సమ్మె పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను కట్టుబానిసలుగా చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ నూతనంగా నాలుగు లెబర్ కోడ్ల అమలుకు కుట్రలు పన్నుతుందన్నారు.
కార్మికుల శ్రమను కార్పోరెట్ శక్తులకు దోచి పెట్టేందుకే కేంద్ర సర్కార్ కార్మిక వ్యతిరేక చట్టాలను తెర మీదకు తెచ్చిందన్నారు. దేశంలోని జాతీయ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 9న జరిగే నిరసన ర్యాలీల్లో అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక విధానాలను ప్రతిఘటించాలని పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటు కనీస వేతనాల జీవోలను సవరించి కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్చును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అందించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అంగన్వాడి, ఆశ. మధ్యాహ్న భోజనం వర్కర్లను స్కీం వర్కర్స్ గుర్తించాలన్నారు. సామాజిక భద్రతతో పాటూ పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, పెన్షన్ వంటి సంక్షేమ పధకాలు అమలు చేయాలన్నారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు రాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ, బీడీ, హమాలీ, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.