godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 9: పేరు గొప్ప… ఊరు దిబ్బ అన్నట్టు ఉంది రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం పరిస్థితి. జిల్లాలోనే ఏకైక కార్పొరేషన్ ఇది. చూడటానికి అద్దాల మేడగా ఉన్నా… సిబ్బంది వాహనాలకు కనీసం పార్కింగ్ షెడ్ లేని దుస్థితి. దీనితో కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి వాహనాలు ఎండలోనే పార్కింగ్ చేయాల్సి వస్తుంది.
ఇక పారిశుధ్య వాహనాలది కూడా అదే దుస్థితి. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు సైతం ఎండలోనే మగ్గుతున్నాయి. వర్షానికి తడుస్తూ… ఎండకు ఎండుతూ కనిపిస్తున్నాయి. పార్కింగ్ షెడ్ లేక ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద, లేదంటే ఎండలోనే వాహనాలు పార్కింగ్ చేసి ఉంచడంతో గతంలో వాహనాల బ్యాటరీలు కూడా మాయమైన సంఘటనలు ఉన్నాయి. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్న సామెతకు ఈ సంఘటనలే దృష్టాంతము గా చెప్పవచ్చు.
ఇది ఇలా ఉండగా ఉదయం చెత్త సేకరణకు వెళ్లిన పారిశుధ్య వాహనాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యాలయంకు చేరుకుంటాయి. తర్వాత ఎండలోనే పార్కింగ్ చేసి ఉంచడంతో మరుసటి రోజు వరకు దుమ్ము, ధూళి పట్టి కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే పాడైపోతున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. కాగా సిబ్బంది, ఇతర కార్మికులకు సంబంధించిన వాహనాలతోపాటు వివిధ అవసరాల కోసం వచ్చే వినియోగదారుల వాహనాలు కూడా ఎండలోనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
అధికారులకు సంబంధించిన వాహనాలు మాత్రం కార్యాలయం వెనుకాల గల చెట్ల కింద నీడన, రేకుల షెడ్ లో పార్కింగ్ చేసి ఉంటాయి. ఈ వ్యత్యాసంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వాహనాలకు కనీస రక్షణ, నీడ లేకున్నా పట్టించుకోవడం లేదని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.