Korukanti Chander | గోదావరిఖని : ‘గోదావరిఖని పట్టణంలో మళ్లీ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది.. సోమవారం రాత్రి పోచమ్మ మైదానంలో జరిగిన కూల్చివేతల చర్యకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ బాధ్యత వహించాలి’ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం అర్ధరాత్రి గోదావరిఖని పట్టణంలోని పోచమ్మ మైదానంలో కోర్టు స్టే ఉన్న పోలీసులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ ఆదేశాలతో కూల్చివేతకు పూనుకున్నారని ఆయన ఆరోపించారు.
దొంగ చాటుకు ఎందుకు కూల్చివేతలకు పాల్పడాల్సి వస్తుందో ఎమ్మెల్యే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అధికార కాంగ్రెస్ పార్టీ అండదండలతో పోలీసులు వారి తొత్తులుగా మారి కూల్చివేతల చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓల్డ్ అశోక్ థియేటర్ను కూల్చివేశారని అందులో ఏం నిర్మాణం చేస్తున్నారో..? ఇప్పటివరకు చెప్పలేదని, పోచమ్మ మైదానంలో కూల్చివేసిన స్థలాన్ని ఏం చేస్తారు అనే విషయం చెప్పడం లేదని, గతంలో రామగుండం ఎమ్మెల్యేగా ఉన్న సోమరపు సత్యనారాయణ హయాంలో అప్పుడు మేయర్ గా ఉన్న కొంకటి లక్ష్మీనారాయణ బిల్డింగులు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అప్పుడు నిర్మాణాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడు కూల్చివేయడం సరైంది కాదని ఆయన అన్నారు.
పేద ప్రజలకు చిరు వ్యాపారులకు సంబంధించిన కట్టడాలను కూల్చివేస్తూ ఎమ్మెల్యే ఆనందాన్ని పొందుతున్నాడని విమర్శించారు. దొంగ చాటుగా కూల్చివేతలు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలతో ఎప్పటికప్పుడు ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం మానుకోవాలని పోలీసులు తమ విధులు తాము చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా వారు వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ సమావేశంలో మూల విజయ రెడ్డి, బొడ్డు రవీందర్, గోపు ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.