న్యూఢిల్లీ: ఓ యువతి వస్త్రధారణ ఆమె వ్యక్తిగత నిర్ణయమని.. ఆమె జీన్స్ వేసుకొన్నంత మాత్రాన అది యువకులను చెడగొడుతుందని భావించడం ఆమోదయోగ్యం కాని మనస్తత్వం అని ఢిల్లీ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. యువతుల వస్త్రధారణను నియంత్రించే బదులు, తల్లిదండ్రులు, సమాజం తమ పిల్లలకు తప్పనిసరిగా వారి ప్రవర్తనను నియంత్రించుకొనేలా, వ్యక్తిగత హద్దులను గౌరవించేలా, ప్రతి మనిషినీ గౌరవించేలా నేర్పించాలని సూచించింది.
2013లో తన పొరుగున ఉన్న వ్యక్తి తనను వెంబడించి లైంగిక భావనలతో కూడిన వ్యాఖ్యలు చేశాడని, అసభ్యంగా తాకాడని ఓ యువతి ఆరోపించిన కేసులో కోర్ట్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ ఐపీసీ సెక్షన్ 354ఏ (1)(ఐ) కింద శిక్ష విధిస్తున్నట్టు తెలిపింది.