కరీంనగర్ రాంనగర్‌లోని ఓ రైస్ మిల్లు నుంచి ధాన్యం తరలింపు వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. ఒక మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని అనుమతి లేకుండానే మరో మిల్లుకు తరలించడం పెద్ద దుమారమే రేపింది. అది కూడా వానకాలం సీజన్లో ఇచ్చిన వడ్లకు పర్మిషన్ తీసుకొని యాసంగి ధాన్యం తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అయితే ధాన్యం తరలింపు గురించి జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారులకు ఫిర్యాదు అందడంతో పరిశీలించేందుకు వచ్చిన ఓ అధికారి, ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే వెనుదిరిగి వెళ్లారని స్థానికుల ద్వారా తెలుస్తున్నది. ఈ విషయం సివిల్ సప్లయ్స్ కమిషనరేట్‌కు తెలియడంతో సోమవారం టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేసి తరలించిన ధాన్యాన్ని కూడా గుర్తించడంతో జిల్లా అధికారుల తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది.
కరీంనగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కరీంనగర్‌లోని రాంనగర్లో ఉన్న ఓ రైస్ మిల్లుకు సివిల్ సప్లయ్స్ అధికారులు కేటాయించిన ధాన్యాన్ని మరో మిల్లుకు తరలించినట్లు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో సోమవారం రాష్ట్ర స్థాయిలోని ఎన్ఫోర్స్మెంట్ అండ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మిల్లులో తనిఖీలు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం పరిధిలోని నగునూర్‌లో ఉన్న ఈ మిల్లర్‌కు చెందిన మరో రైస్ మిల్లుకు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని తరలించినట్లు అధికారులు గుర్తించారు.
గత నెల 28, 31 తేదీలతోపాటు ఈ నెల ఒకటిన మూడు రోజుల పాటు ఈ ధాన్యాన్ని తరలిస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు, జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారులకు సమాచారం అందించారు. ధాన్యం తరలిస్తుండగానే ఈ మిల్లుకు వచ్చిన ఓ అధికారి పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తున్నది. జిల్లా అధికారి పట్టించుకోకపోవడంతో స్థానిక యువకుడు ఒకరు సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ కమిషనరేట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖ కార్యదర్శి చౌహాన్ ఆదేశాల మేరకు సోమవారం టాస్క్‌ఫోర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు.
ఒక మిల్లుకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అధికారుల అనుమతి లేకుండా తరలించినట్లు వెల్లడైంది. నిజానికి ఒక మిల్లు నుంచి మరో మిల్లుకు ధాన్యాన్ని తరలించే పరిస్థితి వస్తే సంబంధిత అదనపు కలెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మిల్లర్ వానకాలం ధాన్యాన్ని తరలించేందుకు అనుమతి తీసుకుని యాసంగి ధాన్యాన్ని నగునూర్‌లోని మరో మిల్లుకు తరలించినట్టు తెలుస్తున్నది. అయితే ధాన్యం తరలిస్తుండగా మిల్లు వద్దకు వెళ్లిన అధికారికి మాత్రం ఈ విషయం ఎందుకు తెలియలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. రాంనగర్‌లోని మిల్లును సందర్శించినపుడే ఈ విషయాన్ని గుర్తించి అభ్యంతరం తెలిపితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లేది కాదని స్థానికులు అంటున్నారు.
టాస్క్‌ఫోర్స్ అధికారులు నివేదించేనా..?
కరీంనగర్ జిల్లాలో ధాన్యం కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నట్లు ఒక్క మిల్లులో టాస్క్‌ఫోర్స్ తనిఖీ చేస్తేనే వెల్లడైంది. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఇంకా అనేక మిల్లులకు అధికారులు ధాన్యం కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది మిల్లర్లు ఏకంగా ధాన్యం అమ్ముకొని సకాలంలో సీఎంఆర్‌కు కూడా ఇవ్వడం లేదని తెలుస్తున్నది. టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా ఈ మిల్లులో తనిఖీలు చేసినపుడు వానకాలం ధాన్యాన్ని తరలించేందుకు అనుమతి తీసుకుని యాసంగి ధాన్యాన్ని తరలించారని మాత్రమే గుర్తించినట్టు తెలుస్తున్నది. నిజానికి నిబంధనలకు విరుద్ధంగా రారైస్ మిల్లుకు యాసంగి ధాన్యం ఎలా కేటాయించారనే దానిపై ఎందుకు ఫోకస్ చేయలేదనే ప్రశ్న తెరపైకి వస్తున్నది.
రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతోనే ఈ విషయం బయటకు వచ్చింది. లేకుంటే కనుమరగయ్యేది. అసలు ధాన్యం తరలిస్తున్నపుడు ప్రత్యక్షంగా చూసిన అధికారి జిల్లా అధికారులకు ఇచ్చిన నివేదికలో ఎలాంటి అంశాలను పొందుపర్చాడనే విషయం ఇపుడు చర్చకు వస్తున్నది. ఇలా అనేక రారైస్ మిల్లులకు యాసంగి ధాన్యం కేటాయించిన అధికారులు మిల్లింగ్ తర్వాత వచ్చే బియ్యం నాణ్యత విషయాన్ని గాలికి వదిలేస్తున్నట్టు తెలుస్తున్నది. టాస్క్‌ఫోర్స్ అధికారులు సరైన నివేదిక ఇవ్వడంతోపాటు అనేక రారైస్ మిల్లులను విస్తృతంగా తనిఖీ చేస్తే జిల్లా అధికారులు చేస్తున్న తప్పులు కుప్పలు తెప్పలుగా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది.
యాసంగి ధాన్యం ఎలా కేటాయించారు?
రాంనగర్లో ఉన్న రారైస్ మిల్లుకు యాసంగి ధాన్యం కేటాయించడం కూడా వివాదం అవుతున్నది. నిజానికి రారైస్ మిల్లులకు వానకాలం ధాన్యాన్ని మాత్రమే కేటాయిస్తారు. యాసంగి ధాన్యంలో నూక శాతం ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బాయిల్డ్ మిల్లులకు మాత్రమే కేటాయిస్తారు. కానీ, ఈ మిల్లుకు మాత్రం యాసంగిలో 2,750 మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కేటాయించినట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని కూడా టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. నిజానికి యాసంగి ధాన్యాన్ని సార్టెక్స్ మిషన్లు ఉన్న మిల్లులకే కేటాయించాలని 2017 నుంచి ప్రభుత్వం నిర్ణయించింది.
కానీ రాంనగర్‌లోని మిల్లుకు సార్టెక్స్ మిషన్ లేకున్నా ఇంత పెద్ద మొత్తంలో యాసంగి ధాన్యాన్ని జిల్లా అధికారులు ఎందుకు కేటాయించారనే ప్రశ్న తెరపైకి వస్తున్నది. ఇలా సార్టెక్స్ మిషన్ లేకుండా జిల్లా వ్యాప్తంగా అనేక రారైస్ మిల్లులకు యాసంగి ధాన్యాన్ని కేటాయించినట్లు తెలుస్తున్నది. రాంనగర్‌లోని రారైస్ మిల్లులో సార్టెక్స్ మిషన్‌తో పాటు పోషక విలువలు ఉండే ఎఫ్ఆర్కే బియ్యాన్ని మిక్స్ చేసే యంత్రం కూడా లేనట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు.
ఇలా లోపభూయిష్టంగా ఉన్న మిల్లులకు ధాన్యాన్ని కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా జిల్లా అధికారులు ఎలా కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే రాంనగర్ మిల్లులో ఈ సదుపాయాలు లేకనే సదరు మిల్లరు నగునూర్‌లోని తనకు చెందిన మరో మిల్లుకు తరలించినట్లు తెలుస్తున్నది. అయితే రెండు మిల్లుల పేరిట ధాన్యం తీసుకుని ఒకే మిల్లులో మిల్లింగ్ చేయిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అధికారులకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయనే విమర్శలున్నాయి.