కరీంనగర్ తెలంగాణ చౌక్, జూన్ 30 : కరీంనగర్ బస్టేషన్ నిర్వహణ గాడి తప్పింది. ఉన్నతాధికారుల అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో వాహనాల పార్కింగ్ అస్తవ్యస్థంగా తయారైంది. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చేవారు, వివిధ పనులపై రీజియన్ ఆఫీసుకు వచ్చేవారు తమ కార్లు, ద్విచక్రవాహనాల కోసం బస్టేషన్ మధ్య ప్రవేశమార్గంలో పికప్, డ్రాపింగ్ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ప్రాంతంలో వాహనాలను కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే నిలిపేందుకు అనుమతి ఉండగా, గంటల కొద్ది అక్కడే నిలిపి వెళ్లిపోవడం, మరోవైపు ఈ స్థలం సరిపోక ఆవరణలోని ఖాళీ స్థలాల్లో ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తుండడంతో పెద్ద సమస్యగా మారింది. వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే స్టేషన్లో పార్కింగ్ గందరగోళంగా మారడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అయితే ఉన్నతాధికారులు స్పందించి వరంగల్ పాయింట్ ఎదురుగా గతంలో పాత బస్ వాషింగ్ చేసిన ఖాళీస్థలాన్ని డ్రాపింగ్ పికప్ కోసం కేటాయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.