కార్మిక క్షేత్రం తల్లడిల్లుతున్నది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో కన్నీరుపెడుతున్నది. నాడు చిక్కి శల్యమై బీఆర్ఎస్ ప్రభుత్వంలో పునర్జీవం పోసుకొని కార్మికులకు చేతినిండా పనితో ఓ వెలుగు వెలిగిన వస్త్రపరిశ్రమ మళ్లీ సంక్షోభంలోకి వెళ్లిపోతున్నది. ప్రభుత్వ చేయూత లేక, వస్త్ర ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాక మాంద్యంలో చిక్కుకున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక పట్టణంలో సాంచాలు నడవక ఉపాధి కోల్పోయి వందలాది మంది బతుకులు ఆగమైపోవడం, అన్నమో రామచంద్రా..! అంటూ ఇప్పటికే పది మంది కార్మికులు బలవన్మరణం చెందడం పరిస్థితికి అద్దంపడుతున్నది. ఓ వైపు పని లేక మరమగ్గాలు తుక్కుకింద అమ్ముకుంటున్న యజమానులను పుండుమీద కారంచల్లినట్టు మరో భారం మోపింది. విద్యుత్ చార్జీల్లో సబ్సిడీలు, రీయింబర్స్మెంట్ ఎత్తివేసి కోలుకోని దెబ్బతీయగా, కరెంట్ బిల్లు భారాన్ని భరించలేమంటూ వస్త్ర ఉత్పత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే టెక్స్టైల్స్ పార్కులోని యూనిట్లను మూసివేయడంతో 1500 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): నాటి పాలనలో చితికిపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు జీవం పోసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి సాంచాలకు పూర్వవైభవం తీసుకొచ్చింది. బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్‌ను సిరిసిల్లకే ఇస్తూ చేతి నిండా పని, పనికి తగ్గ కూలీ వచ్చేలా చర్యలు తీసుకున్నది. తెలంగాణతోపాటు బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ర్టాలకు చెందిన వందలాది మంది కార్మికులకు ఉపాధి లభించింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వక పోవడంతో మరమగ్గాలు మూతపడ్డాయి. వేలాది మంది ఉపాధి కోల్పోయారు. వస్త్ర పరిశ్రమలో సంక్షోభం పునరావృతమైంది. గత ప్రభుత్వం సిరిసిల్ల పట్టణంలోని మరమగ్గాలను కుటీర పరిశ్రమగా గుర్తించి మూడో కేటగిరీ కింద చేర్చి యూనిట్ విద్యుత్ బిల్లు రూ.8లో రూ.2 సబ్సిడీ ఇచ్చింది. ఇక గ్రామీణ ప్రాంతంలో ఉన్న తంగళ్లపల్లి మండలం సారంపల్లిలోని టెక్స్టైల్స్ పార్కులో యూనిట్లకు మాత్రం యూనిట్ విద్యుత్ బిల్లు రూ. 8లో రూ.4 రీయింబర్స్మెంట్ ఇచ్చింది. యజమానులకు ఎంతో మేలు జరిగింది. కార్మికులకు చేతినిండా పనిదొరికింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వీటన్నింటినీ నాలుగో కేటగిరి కిందకు మార్చి సబ్సిడీ, రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేసింది. నేతన్న పొట్టకొట్టింది. కొత్త ఆర్డర్లు రాక ప్రత్యామ్నాయం లేక పట్టణంలోని యజమానులు వస్త్ర ఉత్పత్తులను నిలిపివేశారు.
ఇతర రాష్ర్టాలలో టెక్స్టైల్స్ రంగానికి వినియోగించే విద్యుత్ యూనిట్‌కు రూ.2 మాత్రమే వసూలు చేస్తున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించే వస్త్ర ఉత్పత్తుల పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం యూనిట్‌కు రూ.8 వసూలు చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పట్టణంలోని సాంచాలకు రూ.2 సబ్సిడీ ఇవ్వగా, టెక్స్టైల్స్పార్కులో యూనిట్లకు రూ.4 చొప్పున రీయింబర్స్‌మెంట్‌తో చేయూత నిచ్చింది. పక్కనున్న కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు యూనిట్ విద్యుత్ రెండు రూపాయలకే ఇస్తూ ప్రత్యేక జీవోలు ఇచ్చాయి. దీంతో తయారైన వస్ర్తాలు అక్కడ చాలా చౌకగా లభిస్తుండగా, సిరిసిల్లలో తయారైన వస్ర్తాలకు రేటు ఎక్కువ కావడంతో మార్కెట్లో పోటీ పడలేక పోతున్నారు. అక్కడి మాదిరే విద్యుత్ ఇస్తే తప్ప విఫణిలో పోటీని తట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. అక్కడి ప్రభుత్వాలు టెక్స్టైల్స్ రంగానికి అందిస్తున్న సహకారం ఇక్కడి ప్రభుత్వం కూడా ఇవ్వాలని కోరుతున్నారు. రూ.8కోట్ల రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. తొమ్మిది నెలలు అవుతున్నా ఇంత వరకు సెస్‌కు విద్యుత్ సబ్సిడీ బకాయిలు విడుదల చేయలేదు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం సారంపల్లిలోని టెక్స్టైల్స్ పార్కులోనూ తలెత్తింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో ఎనిమిదేళ్లుగా నిరంతరం నడిచిన పరిశ్రమ నేడు బంద్‌పెట్టే పరిస్థితికి వచ్చింది. యజమానులు సొంతంగా తయారు చేసిన వస్ర్తాలకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాక మాంద్యమం ఏర్పడింది. తయారైన వస్ర్తాలు అమ్ముడుపోక ఉత్పత్తులను నిలిపివేశారు. మీటరుకు రూపాయి నష్టం వస్తున్నట్లు యజమానులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా పేరుగాంచింన ఈ పార్కులో వారం రోజుల క్రితం యూనిట్లను మూసి వేశారు. మొన్నటిదాకా 104 యూనిట్లు ఉండేవి. ఒక్కో యూనిట్లో 15నుంచి 25వరకు ఆధునిక రేపియర్ మరమగ్గాలుండగా, అవి సగానికి తగ్గిపోయాయి. 46యూనిట్లు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. 58యూనిట్లలో 850 మాత్రమే నడిచాయి. అవి కూడా మూత పడి వారం రోజులవుతున్నది. టెక్స్టైల్స్ పార్కులో స్థానికులతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన 1500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. యూనిట్లు మూతపడడంతో సొంతూళ్లకు వెళ్లిపోయారు. టెక్స్టైల్స్ పార్కు నడుస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
వస్త్ర పరిశ్రమలో తీవ్ర మాంధ్యం నెలకొంది. తయారైన వస్ర్తాలకు మార్కెట్ లేక, గిట్టుబాటు ధర రావడం లేదు. కరెంటు బిల్లులు చెల్లించలేక భారమై యూనిట్లు మూసేశాం. ఎన్ని రోజులన్నది ఇదమిద్దంగా చెప్పలేం. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి ప్రోత్సహించింది. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నిరంతరాయంగా యూనిట్లు నడిపించి కార్మికులకు చేతి నిండా పని కల్పించాం. ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ చీరల స్థానంలో మహిళా సంఘాలకు చీరల తయారీ ఆర్డర్లు ఇస్తామంటున్నది. అవి ఎప్పుడు ఇస్తారో? ఎన్ని మీటర్లు ఇస్తారో స్పష్టత లేదు. మేము తయారు చేస్తున్న వస్ర్తాలకు మార్కెట్లో గిట్టుబాటు ధర వస్తే యూనిట్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం.
టెక్స్టైల్స్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలు యూనిట్‌కు రెండు రూపాయలు వసూలు చేస్తున్నయ్. మన రాష్ట్రంలో మాత్రం యూనిట్‌కు రూ.8 వసూలు చేస్తున్నరు. ఇది మాకు భారమైతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇచ్చింది. రూ.4 మాత్రమే చెల్లించినం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది. ప్రభుత్వం చేయూతనివ్వక పోవడం, మరోవైపు మార్కెట్ లేక మాంధ్యం నెలకొనడంతో యూనిట్లు మూసేసినం. పార్కులో చాలా యూనిట్లు మూతపడ్డయ్. 58 యూనిట్లు మాత్రమే నడుస్తున్నయ్. అవి కూడా వారం రోజుల క్రితం నుంచి మూసివేయడం జరిగింది. టెక్స్టైల్స్ రంగం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సహకారం అవసరం. ఇతర రాష్ర్టాల మాదిరిగా విద్యుత్ రాయితీ ఇవ్వాలని కోరుతున్నం.