Ponnam Prabhakar | చిగురుమామిడి, మార్చి 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని కలెక్టర్ చిత్రా మిశ్రా, నవాబ్ పేట్ సర్పంచ్ గూళ్ల రజిత రాజుతో కలిసి సోమవారం ప్రారంభించారు.
అనంతరం మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అధికారులతో కలిసి సన్నాహక సమీక్ష నిర్వహించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రత పాటించాలని సమస్యల పరిష్కారానికి గ్రామస్తులంతా ఐక్యతగా పనిచేయాలన్నారు. రోల్ మోడల్ గా నవాబుపేట ను తీర్చిదిద్దారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని గ్రామస్తులకు సూచించారు. ప్రైవేటు పాఠశాలకు మొగ్గుచూపకుండా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలన్నారు. నవాబుపేట్ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.20 లక్షల మంజూరు చేశామన్నారు. ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో గ్రామస్తులంతా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలన్నారు.
రైతులందరూ తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ కలిసి సంబంధిత అధికారులు పశువులన్నింటిని గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని స్పెషల్ తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలని పశువులకు వచ్చే వ్యాధుల నియంత్రణకు పాటుపడాలన్నారు. అనంతరం పశువైద్యం ఉపకేంద్రం నిర్మాణ పనులకు నిర్వహించారు. ముల్కనూర్ గ్రామానికి చెందిన సంచార చేపల విక్రయ వాహనాన్ని స్థానిక సర్పంచ్ సాంబారి భారతమ్మ తో కలిసి లబ్ధిదారురాలు పెసరి కవితకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీపీవో జగదీశ్వర్, డీఆర్డీవో శ్రీధర్, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారిని మార్త సరస్వతి, జిల్లా పశువైద్యాధికారి లింగారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తహసీల్దార్ రమేష్ ఎంపీడీవో విజయ్ కుమార్ పశువైద్యాధికారులు శ్రీనివాస్ రెడ్డి, సాంబరావు, హాస్టల్ వార్డెన్ మహేందర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.