Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్, మే 9 : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన కౌలు రైతు గోపు శ్రీనివాస్‌ను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న చేను వారు శనివారం పరిశీలించారు. బాధిత రైతు శ్రీనివాస్ ఎకరంన్నర భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేయగా, పంట చేతికొచ్చే సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పంట పూర్తిగా కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో సుమారు రూ.1.50 లక్షల మేర పంట నష్టం జరిగినట్లు తెలిపారు. రైతుబంధు సాయం అందక, కౌలు భారంతో ఉన్న రైతుకు ఈ నష్టం కోలుకోలేని దెబ్బ అని, కలెక్టర్, ఎమ్మెల్యే వెంటనే స్పందించి పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జంగా శ్రీనివాస్ రెడ్డి, సుముఖం రవీందర్ రెడ్డి, నక్కల రాయమల్లు, అల్లం సదయ్య, జంగా సుఖేందర్ రెడ్డి, శ్రీనివాస్, పెంట రవి,జంగ రాజిరెడ్డి మూల సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.