నల్లగొండ, ఆగస్టు 3: జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురసరించుకొని అవయవదానంపై సమాజంలో మరింత అవగాహన కల్పించి, మరణానంతరం కూడా అనేక మంది జీవితాలకు వెలుగునిచ్చిన అవయవదాతల కుటుంబాలను గౌరవించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్టు, లయన్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ సోమవా రం తన చాంబర్లో సన్మానం చేశారు. ఈ సందర్భంగా అవయవదాన ప్రతిజ్ఞ పత్రంపై సంతకం చేసి, అవయవదానంపై సంపూ ర్ణ మద్దతు తెలిపారు. అనంతరం అవయవ దానం ద్వారా పలువురికి పునర్జన్మ ప్రసాదించిన తొమ్మిది మంది అవయవదాతల కుటుంబ సభ్యులకు శాలువాతో సన్మానించి, ప్రత్యేకంగా రూపొందించిన ‘కృతజ్ఞతా పూర్వక’ ప్రశంసా పత్రాలతో కూడిన ప్రత్యేకమైన ఫొటోఫ్రేంను అందజేసి, వారి త్యాగానికి గౌరవ వందనం చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత విషాద సమయంలో కూడా తమ ప్రియమైన కుటుంబ సభ్యుల అవయవాలను దానం చేసేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులు నిజమైన మానవతా మూర్తులని కొనియాడారు. తమ వ్యక్తిగత దుఖాన్ని దిగమింగి, తెలియని వ్యక్తుల జీవితాలను కాపాడేందుకు తీసుకున్న ఈ మహోన్నత నిర్ణయం సమాజానికి ఆదర్శప్రాయమన్నారు. అవయవదానం అనేది మరణానంతరం కూడా జీవితాలను నిలబెట్టే మహాదానమని… ఒక అవయవదాత అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతారని అన్నారు.
అలాంటి దాతల కుటుంబాలను గౌరవించడం సమాజం నైతిక బాధ్యత అన్నారు. వారి త్యాగం మరెందరో అవయవదానం చేసేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320 జిల్లా గవర్నర్ కేవీ ప్రసాద్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అశోక్ ఎర్రమాద, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్వీ కుమార్, ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డా. హరనాథ్ కడిమి, కో-ఆర్డినేటర్లు చిరునోముల చంద్రశేఖర్, కోట సరిత, లయన్స్ సభ్యులు, అవయవదాతల కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.