పెద్దపల్లి, జూలై 6(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి కమాన్ : కాళేశ్వరం ద్వారా పంట పొలాలకు నీళ్లిస్తే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని ప్రాజెక్టుపై ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు లేక రైతులు తండ్లాడుతుంటే.. కేసీఆర్‌పై కక్షతోనే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు. రెండేళ్లు పంప్‌హౌస్‌లు ఆన్ చేయకున్నా.. రైతులు వర్షాలతో సాగు చేసుకున్నారని, ప్రస్తుతం ఎల్‌నినో విపత్తు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదని ఆగ్రహించారు.
పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లకు, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు 13 కిలోమీటర్ల దూరం ఉంటుందని, గేట్లు తెరిచి ఉన్నా.. పంపులు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోయవచ్చని స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యావత్ ప్రపంచ మీడియాకు చూపించారని తెలిపారు. ఎత్తిపోసిన నీటితో కుంటలు, ప్రాజెక్టులను నింపవచ్చన్నారు.
ఈ విషయాన్ని పక్కన పెడుతున్న సీఎం, మంత్రులు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారని, నీళ్లెత్తిపోయలేక నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. నీళ్లెత్తిపోస్తే భద్రాచలం కొట్టుకుపోతుందనడం సిగ్గు చేటన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలో ఎకడా కాళేశ్వరంపై వ్యతిరేకంగా లేదని తెలిపారు. ‘నీళ్లిస్తే పంటలు పండుతాయి. పంటలు పండితే పంట కొనాలి. కొంటే బోనస్ ఇవ్వాలి. రైతు భరోసా ఇవ్వాలి. యూరియా ఇవ్వాలి. కరెంటు ఇవ్వాలి. ఇలా ఏవీ ఇవ్వకుండా ఉండడం కోసమే రైతులను ప్రభుత్వం నిలువునా ముంచుతున్నది’ అని ధ్వజమెత్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా యూరియా కోసం రాష్ట్రంలో దికుమాలిన యాప్ పెట్టారని, బోనస్ ఎగ్గొట్టడం కోసం ఏడు సన్న రకాలు తెచ్చారని, రైతులను సర్వ నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్నారని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా పంపులను ఆన్ చేయకుంటే లక్ష మంది రైతులతో వెళ్లి కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తామని ప్రకటించారు. సమావేశంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ జడ్పీటీసీ గంట రాములు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వచ్చింది.. గోదారి ఎండింది
తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ హయాంలో గోదావరి ఎడారిగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో నిండుకుండలా మార్చాం. తెప్పల పోటీలను కూడా నిర్వహించాం. యావత్ మత్స్యకారులకు ఉపాధి మార్గాలు కల్పించాం. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గోదావరి ఎండింది. ఇప్పుడు అందులో క్రికెట్ ఆడుతున్నరు. ‘తలాపున పారుతుంది గోదారి.. నీ సేను నీ సెలుకా ఎడారి’ అనే పాటలు మళ్లీ పాడుకునే పరిస్థితులు వచ్చాయి. రైతులు నీళ్లకోసం ఎదురుచూస్తున్నా కాంగ్రెస్ సరార్కు చీమ కుట్టినట్టు కూడా లేదు.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్ పేరును బద్నాం చేసేందుకే
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలోనే గొప్పదైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసిండు. అలాంటి ప్రాజెక్టుకు చిన్నచిన్న రిపేర్లు చేసి నడిపించాల్సింది పోయి.. ఆయన పేరును బద్నాం చేయడానికే నీళ్లివ్వడం లేదు. కాంగ్రెస్ కావాలనే రైతులను గోస పెడుతున్నది. నీళ్లు సరిగా వాడుకుంటే ఇప్పటికే నల్గొండ వరకు చేరేవి. 70 లక్షల మంది రైతులకు నష్టం జరిగినా మంచిదే కానీ, కాళేశ్వరం నీళ్లు మాత్రం ఇవ్వం అన్నట్టుగా ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. రాబోయే రోజుల్లో రైతులు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.
– దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే
వెంటనే పంపులు ఆన్ చేయాలి
మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నది. మరోవైపు సాగు నీరు లేక రైతులు విలవిల్లాడుతున్నరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి సందర్శనతో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయినయి ప్రభుత్వ బండారం బట్టబయలైంది. నీళ్లిస్తారని రైతులు ఆశతో చూస్తున్నరు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కళ్లు తెరిచి పంప్‌హౌస్‌లు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలి. లేనిపక్షంలో రైతులు, ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతరు.
– పుట్ట మధూకర్, మంథని మాజీ ఎమ్మెల్యే