న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం(Air India Plane) గాలిలో ఉన్న సమయంలో భారీ కుదుపుకు లోనైంది. ఈ ఘటనలో సుమారు 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో పాటు ఇద్దరు విమాన సిబ్బంది కూడా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. కుదుపు వల్ల విమానానికి ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఈ ఘటన పట్ల ఎయిర్ ఇండియా ప్రకటన చేసింది.
పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఫ్లయిట్ ఏఐ379 ఆగస్టు 4వ తేదీన స్వల్ప స్థాయిలో ప్రకంపనలకు లోనైనట్లు పేర్కొన్నది. ఆల్టిట్యూడ్ మార్పు సమయంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఏదేమైనా ఆ విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. విమానం కుదుపునకు గురైనప్పుడు దాంట్లో సుమారు 134 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతానికి సీరియస్ గాయాలు లేవని ఎయిర్‌లైన్ సంస్థ ప్రకటించింది.
అకస్మాత్తుగా ఆల్టిట్యూడ్ మార్పు జరగడం వల్ల కుదుపునకు గురైనట్లు ప్రయాణికులు తెలిపారు. కొందరు ప్రయాణికుల తలలు విమాన రూఫ్‌కు బలంగా తగిలాయి. కొందరి తలకు గాయాలు కాగా, కొందరి శరీరాలకు దెబ్బలు తగిలాయి. బాధిత ప్రయాణికులకు సపోర్టు ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.