SalmanKhan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో నటించేందుకు సల్మాన్ ఖాన్ తన పారితోషికాన్ని (Remuneration) భారీగా తగ్గించుకున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను సినిమా నిర్మాతలు తాజాగా ఖండించారు. ఆ ప్రచారమంతా పూర్తిగా నిరాధారమైనదని స్పష్టం చేశారు. ఇలాంటి ఊహాగానాలపై స్పందించడం కంటే, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమా అనుభూతిని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని మేకర్స్ పేర్కొన్నారు.
‘SVC63’గా పిలవబడుతున్న ఈ సినిమా ప్రస్తుతం అత్యంత కీలకమైన ముంబై యాక్షన్ షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. 2027 ఈద్ (Eid) కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతుండగా, ఇందులో భాగంగా ఆగస్టు 6 నుంచి ముంబైలో భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. దాదాపు ఆరు వారాల పాటు సాగనున్న ఈ షెడ్యూల్లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో కూడిన పెద్ద ఎత్తున క్రౌడ్ సీన్స్ చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ అంతటా ఈ షూటింగ్ కొనసాగనుండగా, అక్టోబర్ నాటికి యాక్షన్ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. ఈ భారీ యాక్షన్ షెడ్యూల్‌ను మొదట హైదరాబాద్‌లో ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల దానిని ముంబైకి మార్చినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ స్టంట్స్‌తో పాటు జనాల మూవ్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండే ఈ షెడ్యూల్లో ప్రముఖ నటి నయనతార కూడా యూనిట్‌తో చేరనున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా 120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే సల్మాన్ ఖాన్, ఈ సినిమా కోసం దానిని సుమారు 70 కోట్లకు తగ్గించుకున్నారని, నిర్మాత రఫీ కాజీతో ఉన్న స్నేహం కారణంగానే ఈ ఫీజు తగ్గింపు జరిగిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఇప్పుడు మేకర్స్ ఆ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. మరోవైపు సల్మాన్ ఖాన్ అపూర్వ లఖియా దర్శకత్వంలో ‘మాతృభూమి’ చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే రాజ్ & డీకే దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ గురించి కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.