– ఉద్యోగులు రోడ్డు ఎక్కడం బాధాకరం
– తక్షణమే డీఏ బకాయిలు చెల్లించండి
– అత్యధిక వేతనాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ దే
– అమలుకు నోచుకోని జాబ్ క్యాలెండర్
– రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైన ఉద్యోగులను భారంగా చూడొద్దని హితవు
– కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లంతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి
కోదాడ, ఆగస్టు 04 : ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన, అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్లకు లక్షల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఉద్యోగస్తుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుకు, పాత పెన్షన్ విధానం అమలుకు నిధులు లేకపోవడం విచారకరమని, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఉట్టి మాటలు కట్టిపెట్టి ఉద్యోగుల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన ఉద్యోగులు నేడు తమ హక్కుల కోసం రోడ్డు ఎక్కడం బాధాకరమన్నారు. ఈ ఏడాది జూలై తో కలిపి ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ పై స్పష్టత ఇచ్చి సీపీఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలన్నారు.
రిటైర్మెంట్ బకాయిలు పెన్షన్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల జీతాల నుండి 1.5% ఈ హెచ్ ఎస్ కోత విధించినప్పటికీ వైద్య సేవలు అందించకపోవడం శోచనీయమన్నారు. కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ధర్నా చేసిన పరిస్థితిలో రెండు నెలల క్రితం ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. 317 జీవో రద్దు చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి సామాజిక భద్రత కల్పించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఇతర రాష్ట్రాలలో ప్రచారానికి చెక్కర్లు కొట్టేందుకు హెలికాప్టర్ కు నిధులు ఉంటాయి కానీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిధులు ఎందుకు లేవని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులు రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములను రాకేష్ రెడ్డి ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్, పట్టణ మాజీ అధ్యక్షుడు కె.బాబు, గట్ల కోటేశ్వరరావు, ఉపేందర్ గౌడ్, కరీముల్లా బాబా, చలిగంటి వెంకట్ పాల్గొన్నారు.