– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
రామగిరి, అక్టోబర్ 03 : రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సూచనలు తీసుకోవాలని అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభ ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. పంట నష్టంతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ప్రస్తుత పంటలను కాపాడేందుకు సాగునీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయం దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతున్నాయన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో పాటు కరువు పరిస్థితుల నుండి బయటపడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర బృందాలను రాష్ట్రానికి రప్పించి కరువు పరిస్థితులు, పంట నష్టాన్ని పరిశీలించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. నవంబర్ 15న లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే మహాసభలకు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై మహాసభల్లో సమగ్రంగా చర్చించి, వ్యవసాయ రంగ పరిరక్షణకు అవసరమైన భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి సంబంధించిన విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. పంటల బీమా రైతులకు మరింత ఉపయోగపడేలా మార్పులు చేయాలని కోరారు.
వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు, దిగుమతి సుంకాల తగ్గింపు వల్ల దేశీయ రైతులకు నష్టం జరుగుతోందన్నారు. వేరుశనగ, నువ్వులు, కుసుమ, పత్తి తదితర పంటలు పండించే రైతులకు న్యాయం చేయాలని కోరారు. పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న పేద, మధ్యతరగతి రైతుల భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వీరపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు నారి ఐలయ్య, బండ శ్రీశైలం, ఎండి హశం, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.